పంచాయతీ ఎన్నికలు: మహిళా రిజర్వేషన్లకు లాటరీ
Telangana Panchayat Polls : తెలంగాణ పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం కొత్త రిజర్వేషన్ జీవో విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రొటేషన్‌తో 50% లోపే రిజర్వేషన్లు ఖరారు చేసింది.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి.. కొత్త రిజర్వేషన్ జీవో విడుదల
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతం పరిమితిలో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ కేటాయింపు పద్ధతులు, రొటేషన్ విధానం, అధికారుల బాధ్యతలు వంటి కీలక అంశాలను స్పష్టంగా పేర్కొంటూ జీవో 46ను శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ జీవోతో గ్రామీణ ప్రాంతాల్లో రాబోయే ఎన్నికల పై స్పష్టత రావడంతో స్థానిక నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
రిజర్వేషన్ల కేటాయింపు.. 2011 జనాభా లెక్కలు, 2024 కుల సర్వే ఆధారం
రిజర్వేషన్ విధానంలో ఈసారి ప్రభుత్వం వాడబోయే డేటా కీలకం కానుంది.
• సర్పంచ్ పదవులకు – 2011 జనగణన
• బీసీ సర్పంచ్ రిజర్వేషన్లకు – 2024 SEEPC కుల సర్వే
• వార్డు సభ్యులకు – 2024 కుల గణాంకాలు
రిజర్వేషన్ల కేటాయింపులో ముందుగా ఎస్టీ, తరువాత ఎస్సీ, చివరగా బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని జీవో స్పష్టంచేసింది. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువగా ఉన్న ప్రాంతాలకు వరుసగా రిజర్వేషన్లు అమలు చేయాలి. 100 శాతం ఎస్టీ జనాభా కలిగిన గ్రామాల్లో అన్ని స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ అవుతాయని కూడా ప్రభుత్వం తెలిపింది.
బీసీ రిజర్వేషన్ వివాదం.. 42% లక్ష్యం సాధ్యమా?
గతంలో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నించినా, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈసారి బీసీలకు 23 శాతం రిజర్వేషన్ ఖరారు చేసినట్లు జీవో స్పష్టం చేస్తోంది.
అయితే, మిగిలిన శాతం విషయంలో బీసీలకు ‘జనరల్ కేటగిరీ’లో కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బీసీ నేతలు దీనిని ఎంత వరకు అంగీకరిస్తారన్నది నోటిఫికేషన్ తర్వాతే స్పష్టమవుతుంది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేగం పుంజుకున్న ఎన్నికల ఏర్పాట్లు
హైకోర్టు డిసెంబర్ 20లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం మూడు విడతల్లో 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్ జరపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కూడా వేగవంతంగా ఏర్పాట్లు చేస్తోంది. కమిషనర్ రాణి కుముదిని ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీడీవోలు, పంచాయతీ దఫ్తర్లు అన్నీ ఎన్నికల విధానాలను సమీక్షించాయి.
మహిళా రిజర్వేషన్లకు లాటరీ.. పారదర్శకతపై ప్రభుత్వ నమ్మకం
పోలిటికల్ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయాలని జీవో స్పష్టం చేసింది. ఇది రొటేషన్ విధానంలో జరగాలి. గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన గ్రామం/వార్డు తిరిగి అదే కేటగిరీలోకి వెళ్లకూడదని కూడా పేర్కొంది.
జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు రిజర్వేషన్ల కేటాయింపును అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2019 ఎన్నికల్లో నోటిఫై చేయలేకపోయిన రిజర్వేషన్లను ఈసారి అమలు చేయడానికి కూడా అనుమతి ఇచ్చింది.

