Telangana Formation day : హైదరాబాద్ పేరులో ఈ హైదర్ ఎవరు?
ఇంతకాలం హైదరాబాద్ అంటే ఓ మహిళ పేరు అనే మనందరికి తెలుసు. కానీ ఈ పేరు వెనక మరో కథ దాగివుందని తెలుసా? ఆ పేరు వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలంగాణ అవతరణ దినోత్సవం స్పెషల్ స్టోరీ
Telangana Formation Day 2025 : తెలుగు ప్రజలకు హైదరాబాద్ ఓ సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు తెలంగాణోళ్లు, అటు ఆంధ్రులు హైదరాబాద్ మాదంటే మాదని వాదించుకున్నారు... అందుకే రాష్ట్ర విభజన సమయంలో ఈ నగరంపై ప్రధాన చర్చ జరిగింది. చివరకు పదేళ్లపాటు హైదరాబాద్ ను ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కొనసాగుతోంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. అసలు హైదరాబాద్ కు ఈ పేరెలా వచ్చింది? దాని వెనకాలున్న ఆసక్తికర కథలేమిటి?
హైదరాబాద్ పేరు వెనకున్న చరిత్ర :
ప్రస్తుతం హైదరాబాద్ అంటే తెలియనివారు ఉండరు... దేశంలోని అన్నిప్రాంతాల ప్రజలు ఇక్కడ కనిపిస్తారు. పాత నగరం చారిత్రక వైభవానికి ప్రతీక అయితే... కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ ఆధునికత, అభివృద్ధికి నిదర్శనం. ఇలా పాత కొత్త మేళవింపుతో హైదరాబాద్ మెట్రో సిటీగా వెలుగొందుతోంది.
అయితే హైదరాబాద్ నగరం దాదాపు 400 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన పురాతన నగరం. ఈ నగరాన్ని మూసి నది ఒడ్డున 1591 లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. మొదట్లో ఈ నగరానికి 'బాగ్ నగర్' అని... ఆ తర్వాత భాగ్యనగర్ అని... కాలక్రమేణ హైదరాబాద్ అనే పేరు శాశ్వతంగా స్థిరపడింది.
గోల్కొండ నుండి మూసి ఒడ్డుకు రాజధాని మార్పు
కుతుబ్ షాహీల కంటే ముందు కాకతీయుల కాలంలో మూసి నది ఒడ్డున చిన్న గ్రామం ఉండేది. మొదట కుతుబ్ షాహీలు గోల్కొండను రాజధానిగా చేసుకుని పాలన సాగించేవారు. అయితే గోల్కొండ పరిసరాల్లో నీటి సమస్య తలెత్తడంతో మహ్మద్ కులీ కుతుబ్ షా మూసి నది ఒడ్డున గల గ్రామాన్ని అభివృద్ధి చేసారని చెబుతారు. అంటే గోల్కొండ నుండి మూసి నది ఒడ్డుకు రాజధానిని మార్చారన్నమాట. ఇలా కొత్తగా నిర్మించిన నగరానికి బాగ్ నగర్ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది.
బాగ్ నగర్ కాస్త హైదరాబాద్ గా ఎలా మారిందంటే..
అయితే కులీ కుతుబ్ షా ఈ సమయంలోనే ఓ హిందూ యువతిని ప్రేమించాడు. ఆమె పేరు భాగమతి. ఇతర మతానికి చెందిన యువతిని రాజవంశీకులు పెళ్లిచేసుకోవడం ఆనాడు కుదిరేది కాదట... అందుకే భాగమతిని ఇస్లాం మతంలోకి చేర్చుకుని పెళ్లాడాడట కుతుబ్ షా. ఇలా ఇస్లాం స్వీకరించిన భాగమతి కాస్త హైదర్ మహల్ గా పేరు మార్చుకుంది. ఆమెను ఎంతగానో ఇష్టపడే సుల్తాన్ బాగ్ నగర్ ను కాస్త హైదరాబాద్ గా మార్చినట్లు చరిత్రకారులు చెబుతారు.
హైదరాబాద్ పేరువెనక ఆయన
అయితే హైదరాబాద్ పేరువెనక మరో స్టోరీ కూడా ఉంది. మహ్మద్ కులీ కుతుబ్ షా నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట మూసీ నది ఒడ్డున నగర నిర్మాణం చేపట్టాడని చెబుతారు. అందుకే ఆయన హైదరాబాద్ అని పేరు పెట్టాడని మరికొన్ని చారిత్రాత్మక కథలు చెబుతాయి.
ఇలా హైదరాబాద్ పేరు ఎలా వచ్చినా ఇప్పుడు ఈ నగరం ప్రపంచస్థాయికి ఎదిగింది. ఓవైపు చార్మినార్, గోల్కొండ కోట, పలక్ నుమా ప్యాలస్, హుస్సెన్ సాగర్ వంటి పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకుంటే... మరోవైపు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రాం గూడ లాంటి ఐటీ ఏరియాలు, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వంటి లగ్జరీ ప్రాంతాలతో అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. అంటే హైదరాబాద్ లో పేద, మధ్యతరగతి, సంపన్నులు అందరూ జీవిస్తారు… ఎలాంటి అసమానతలు లేకుండా అందరినీ అక్కున చేర్చుకుంటుంది ఈ నిజాంల నగరం హైదరాబాద్.