- Home
- Telangana
- Telangana Cabinet: చెక్ పోస్టుల రద్దు.. స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలనం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Cabinet: చెక్ పోస్టుల రద్దు.. స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలనం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ 25 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. చెక్ పోస్టుల రద్దుతో పాటు మైక్రో బ్రూవరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించింది.

తెలంగాణ కేబినెట్ మీట్ లో 25 అంశాలపై సమీక్ష
తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సోమవారం (జూలై 28న) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో మొత్తం 25 అంశాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రవాణా, పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై కేబినెట్ చర్చించింది.
అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు గుడ్‌బై
తెలంగాణ సరిహద్దుల్లోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తొలగించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాహనాల ఆగడాలు, సమయ నష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెక్ పోస్టుల రద్దుకు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రం ఈ దిశగా చర్యలు తీసుకుంది. ఇకపై వాహనాల పర్యవేక్షణ కోసం ఆధునిక ‘వాహన్’ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాలు ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
చెక్ పోస్టుల రద్దుతో కలిగే ప్రయోజనాలు ఏంటి?
- చెక్ పోస్టుల వద్ద జరిపే తనిఖీలు, అనవసర ఆపడాల వల్ల ప్రయాణ సమయం పెరుగుతుంది. చెక్ పోస్టులు తొలగిస్తే వాహనాలు నిరాటంకంగా ముందుకు కదులుతాయి. ఇది వ్యక్తిగత ప్రయాణదారులకే కాదు, వాణిజ్య వాహనాలకూ ఎంతో ప్రయోజనం.
- రవాణా ఆలస్యం వల్ల వ్యయం పెరుగుతుంది. చెక్ పోస్టులు లేకపోతే వేచి ఉండే సమయం, ఇంధన ఖర్చు తగ్గిపోతుంది. వ్యాపారాల రవాణా వ్యయం తగ్గి, ధరలపై కొంత ప్రభావం పడవచ్చు.
- చెక్ పోస్టుల వద్ద పలు సందర్భాల్లో అక్రమ వసూళ్లు, అవినీతికి దారితీసే అవకాశాలు ఉండేవి. టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణకు మారడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.
- చెక్ పోస్టుల స్థానంలో ‘వాహన్’ సాఫ్ట్‌వేర్, సీసీ కెమెరాలు వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించడం వల్ల ఎక్కడైనా నియంత్రణ కొనసాగుతుంది. చట్ట ఉల్లంఘనలపై తక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది.
- కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు చెక్ పోస్టులు తొలగించాలన్న సూచనలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఆ మార్గదర్శకాలను అమలు చేయడమే కాకుండా, పరస్పర వ్యవహారాల్లో సౌలభ్యం కల్పిస్తోంది.
మైక్రో బ్రూవరీస్‌కు తెలంగాణ కేబినెట్ అనుమతి
పట్టణాభివృద్ధి రంగంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు అనుమతినిచ్చారు. కోర్ తెలంగాణ అర్బన్ సిటీలతోపాటు ఇతర పట్టణాలలో వీటి స్థాపనకు అవసరమైన చట్ట సవరణలు చేయాలని నిర్ణయించారు. ఇది వినోదం, పర్యాటక రంగాలకు ఉత్సాహాన్నిస్తుందని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి.
బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నాకు పిలుపు
బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆగస్టు 5వ తేదీన ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా
హైకోర్టు గడువుపై ఉన్న ఒత్తిడిలోనూ, రిజర్వేషన్ల స్పష్టత రాకపోవడంతో, బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చిలో శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులు ఇప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే కేబినెట్ మీట్ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ, బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల బీసీ నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.