Telangana : ప్రధాని పర్యటన రోజే .. శ్రీశైలంపై రేవంత్ కేబినెట్ కీలక నిర్ణయం
Telangana Cabinet Decisions : రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బిసి రిజర్వేషన్లు, వ్యవసాయ కాలేజీలతో పాటు శ్రీశైలంకు సంబంధించి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి.

నేడు వార్తల్లో శ్రీశైలం
Telangana : ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం నేడు(అక్టోబర్ 16) ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన వార్తగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మరోవైపు హైదరాబాద్ నుండి శ్రీశైలంకు వెళ్లే రహదారి రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ నుండి శ్రీశైలంకు వెళ్లే రహదారిలో నాలుగులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. దాదాపు రూ.7,668 కోట్ల వ్యయంతో 45 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గడమే కాదు నల్లమల అడవిలోని జంతువుల సంరక్షణకు ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉపయోగపడుతుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి దీనిపై చర్చించి ఆమోదం తెలిపింది. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం భరించాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కాలేజీలు
తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కాలేజీలను ఏర్పాటుచేయాలని... వచ్చే విద్యాసంవత్సరం నుండి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది.
బిసి రిజర్వేషన్లపై చర్చ
తెలంగాణలో బిసి రిజర్వేషన్ల అంశం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం... హైకోర్ట్, సుప్రీంకోర్టులు బిసి రిజర్వేషన్ల పెంపుకు అనుమతించకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కేబినెట్ లో చర్చించారు. సీనియర్ న్యాయవాదులు సలహాలు, సూచనలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
డిసెంబర్ లో ప్రజాపాలన విజయోత్సవాలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే డిసెంబర్ తో రెండేళ్లు పూర్తవుతుంది. దీంతో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. ఇలా డిసెంబర్ డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారుల ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.
ఇంకా మెట్రో ఫేజ్ 2, రైతు భరోసా వంటి మరికొన్ని కీలక అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆమెపై వేటుపడే అవకాశాలన్నాయన్న ప్రచారానికి కేబినెట్ భేటీకి హాజరుకాకపోవడం మరింత బలాన్ని ఇస్తోంది.