Telangana Weather : మాన్ సూన్ బ్రేక్ ... తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఏంటి?
Andhra Pradesh Weather : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు మాన్ సూన్ బ్రేక్ పరిస్థితులకే కారణంగా తెలుస్తోంది. మళ్లీ వర్షాలు ఎప్పుడు జోరందుకుంటాయంటే…

తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం
తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజులుగా జోరుగా వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మరీముఖ్యంగా రైతులకు ఊరటనిచ్చాయి. వర్షాకాలం మొదలైన నెల రోజుల తర్వాత అంటే చాలారోజుల ఎదురుచూపుల తర్వాత ఈ వర్షాలు మొదలయ్యాయి... అందుకే తెలుగుప్రజల్లో ఆనందం. అయితే కొద్దిరోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి... కానీ ప్రస్తుతం తగ్గాయి. మళ్లీ ఆగస్ట్ సెకండ్ వీక్ లో వర్షాలు జోరందుకుంటాయని... భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.
KNOW
ఇవాళ తెలంగాణ వాతావరణం
హైదరబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం... నేడు(గురువారం) పొడి వాతావరణం ఉండనుంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. సాయంత్రం సమయంలో చిరుజల్లులతో పాటు బలమైన గాలులు వీస్తాయని... గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా ఈ గాలులుంటాయని తెలిపింది. ఇదే పరిస్థితి అన్నిజిల్లాల్లో ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ.
ఇవాళ్టి (జులై 31) నుండి ఆగస్ట్ 4 వరకు తెలంగాణలో ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని... పెద్దగా వర్షాలుండవని వెల్లడించింది. ఆగస్ట్ సెకండ్ వీక్ లో వర్షాలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయట. ఈ నెలంతా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :30-07-2025 @TelanganaCS@DCsofIndia@IASassociation@TelanganaDGP@TelanganaCMO@GHMCOnline@HYDTP@IasTelangana@tg_weather@Indiametdeptpic.twitter.com/ehBuWbnVBp
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 30, 2025
హైదరాబాద్ వాతావరణం
నిన్నంతా (బుధవారం) హైదరాబాద్ లో పొడి వాతావరణమే ఉంది... కానీ సడన్ గా సాయంత్రం వర్షం మొదలయ్యింది. ఇదే పరిస్థితి ఇవాళ (గురువారం) కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
నిన్న అత్యధికంగా కూకట్ పల్లిలో 13 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. బాలానగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, పటాన్ చెరు, రామచంద్రాపురం, షేక్ పేట, అంబర్ పేట్ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
ప్రస్తుతం రుతుపవన విరామకాలం (మాన్సూన్ బ్రేక్) కొనసాగుతోంది... అంటే వర్షాలు కురిసే పరిస్థితులు లేవన్నమాట. మరో నాలుగైదు రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే పరిస్థితి ఉంటుందని... అక్కడక్కడా చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలుండవని వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గురువారం చెదురుమదురు జల్లులు కురిసే అవశాలున్నాయి... రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరగవచ్చని హెచ్చరించింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా జూరాల ప్రాజెక్ట్ నుండి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది... శ్రీశైలం నుండి 3,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు నీరు చేరింది... 203 టిఎంసిలతో పూర్తిస్థాయి నీటినిల్వ నమోదయ్యింది.