నేడూ వానలు దంచుడే దంచుడు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Telangana, Andhra Pradesh Weather Update:వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశాతీరంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అల్పపీడనం ఎఫెక్ట్..
Telangana, Andhra Pradesh Weather LATEST update:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాజా వాతావరణ ప్రాంతాల వారీగా భిన్నంగా కనిపిస్తున్నాయి. కానీ, వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో వాయుగుండం ఏర్పడింది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే, మరికొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో గాలుల వేగం తీవ్రం కావడం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని అధికారులు ముందుగా హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్ సహా రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో మేఘావృత స్థితి కొనసాగుతుందని అంచనా.
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో గత రెండు వారాలుగా నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ వాయుగుండం పశ్చిమ–వాయువ్య దిశలో కదులుతూ భవానీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
అల్ప పీడన ప్రభావంతో నేడు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం (రేపు) రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
అల్పపీడనం ప్రభావంతో మరో 24 గంటల పాటు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, తూర్పు–పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, తాడేపల్లిగూడెం, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, తిరుపతి, కడప భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దనీ, వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వర్షాలు ఈ నెల 25 వరకు కొనసాగుతాయని IMD తెలిపింది.
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ నగరంలో సోమవారం అర్ధరాత్రి నుండి వర్షం మొదలై మంగళవారం ఉదయం వరకు కురిసింది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం కొనసాగింది. నేడు ( బుధవారం ) రోజంతా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. GHMC పరిధి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి ప్రభావితం కానున్నాయి. ప్రజలు అనవసరం బయటకు వెళ్లవద్దనీ, వాహనాలు సురక్షిత మార్గాల్లో నడపాలని అధికారులు సూచించారు. విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాల సూచనలను తప్పక పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.