Holidays : ఈ శుక్రవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందా? ఎందుకో తెలుసా?
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులకు ఈవారం ఓ సడన్ హాలిడే వచ్చేలా ఉంది. ఇదే జరిగితే సాధారణమైన ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది.

ఈ వారంలో సడన్ సెలవు?
Telangana and Andhra Pradesh Bandh : వేసవి సెలవులు ముగిసి ఇటీవలే స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం అయ్యాయి. దాదాపు రెండునెలల పాటు చదువు, పుస్తకాలకు దూరంగా... కేవలం ఆటాపాటలకే పరిమితమయ్యారు చిన్నారులు… అలాంటిది వీరిని ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లమంటే బాధగానే ఉంటుంది. కొద్దిరోజులు అలవాటయితే విద్యార్థులే ఆనందంగా స్కూల్ కి వెళతారు. అప్పటివరకు వారు ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే మధ్యమధ్యలో సెలవులు అవసరం... ఇవి వారి బాధను తగ్గించి కాస్త ఊరటనిస్తాయి.
అయితే జూన్ లో కేవలం ఆదివారాలు మినహా సెలవులేమీ లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సడన్ గా ఓ సెలవు ఆశలు చిగురించాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోని స్కూళ్ళు, కాలేజీలు ఈ శుక్రవారం (జూన్ 20) నడవడం కష్టమే... ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో ఈవారంలో అనుకోకుండా ఓరోజు సెలవు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్
దేశంలో మావోయిస్టుల ఏరివేతకోసం కోసం కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కగార్' చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి... అడవులను జల్లెడపడుతూ మావోయిస్టులను కాల్చిపారేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్-ఒడిషా, తెలంగాణ-చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి.
భద్రతా బలగాల కాల్పుల్లో సామాన్య మావోయిస్టులే కాదు అగ్రనేతలు నంబాల కేశవరావు వంటివారు కూడా చనిపోయారు. అలాగే మరో కీలక నేత కుంజమ్ హిడ్మా కూడా ఇప్పటికే భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. ఇలా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే వందలాదిమంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు అరెస్టవడం, మిగతావారు చెల్లాచెదురు కావడంతో మావోయిస్ట్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.
అయితే ఇప్పటికే మావోయిస్టుల కాస్త వెనక్కితగ్గి శాంతియుతంగా చర్చలకు సిద్దమయ్యారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు కూడా ఆపరేషన్ కగార్ ను తప్పుబడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ ను ఆపడంలేదు. దీంతో మావోయిస్టులు తెలుగు రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చారు.
జూన్ 20న అంటే వచ్చే శుక్రవారం ఇరు తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రజలు ఈ బంద్ కు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తాము చేపట్టిన బంద్ ను విజయవంతం చేయాలంటూ మావోయిస్ట్ అగ్రనేత జగన్ పేరుతో ఓ లేఖ విడుదలయ్యింది.
తెలుగు రాష్ట్రాలపై బంద్ ప్రభావం
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి... ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందుస్తుగానే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావిత ఏపీ, తెలంగాణ, ఒడిషా, చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు... ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీ చేపట్టారు. అడవుల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టారు.
జూలై 20న బంద్ ప్రభావం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూతపడే అవకాశాలున్నాయి. కార్యాలయాలు మూతపడి ఉద్యోగులకు కూడా సెలవు లభించవచ్చు. అయితే అన్నిప్రాంతాల్లో ఇలా సెలవు ఉండకపోవచ్చు.
బంద్ సక్సెస్ అయితే లాంగ్ వీకెండే..
వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఈ మావోయిస్టుల బంద్ లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఆర్టిసి బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను అడ్డుకోవడం, వ్యాపార సముదాయాలను మూసేయించడం చేయవచ్చు.
ఇక వామపక్ష విద్యార్థి సంఘాలు జూన్ 20 స్కూళ్లు, కాలేజీలను మూసేయించవచ్చు. ఇదే జరిగితే కేవలం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడతాయి. ఈ బంద్ సక్సెస్ ఫుల్ గా జరిగితే ఈ సాధారణ వారం కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది.
బంద్ తో మూడ్రోజులు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో మరీముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కొన్ని విద్యాసంస్థలకు కేవలం ప్రతి ఆదివారమే కాదు శనివారం కూడా సెలవు ఉంటుంది. ఇక పలు మల్టినేషనల్ కంపనీల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయిస్ తో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారంలో రెండ్రోజులు హాలిడేస్ ఉంటాయి. అయితే ఈ శుక్రవారం మావోయిస్టుల బంద్ నేపథ్యంలో సెలవు వస్తే వీరికి వరుసగా మూడ్రోజుల హాలిడేస్ కలిసివస్తాయి.
మావోయిస్టుల బంద్ తో ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారే అవకాశాలున్నాయి. ఇలా వరుస సెలవులు వస్తే ఈ చల్లచల్లని వాతావరణంలో ప్రకృతి అందాలను ఆస్వాదించే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో పిల్లల్లో వేసవి సెలవులు ముగిసాయన్న బాధ తగ్గుతుంది... పని ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు కూడా రిప్రెష్ కావచ్చు.