- Home
- Telangana
- Revanth Reddy: 2027 నాటికి ఆ సర్వీసులు, నెట్ జీరో సిటీగా హైదరాబాద్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: 2027 నాటికి ఆ సర్వీసులు, నెట్ జీరో సిటీగా హైదరాబాద్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వివరాలు తెలిపారు.

ట్రిలియన్ డాలర్ల లక్ష్యం
దిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికను వివరించారు. 2035 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణను దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలపాలని ప్రతిజ్ఞ చేశారు.
మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మెట్రో రైలు వ్యవస్థను 150 కి.మీ.లకు విస్తరించి, రోజూ ప్రయాణించే వారి సంఖ్యను ఐదేళ్లలో 15 లక్షలకు పెంచే ప్రణాళిక ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆధునిక మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి జరుగుతోందని, 2027 నాటికి నగరంలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలనుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ద్వారా హైదరాబాద్‌ను నెట్ జీరో సిటీగా (కాలుష్య రహిత పట్టణం) మార్చే కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.
పరిశ్రమలు, పెట్టుబడులకు ఆహ్వానం
రాష్ట్ర అభివృద్ధికి ప్రైవేట్ రంగం మద్దతు కీలకమని సీఎం స్పష్టం చేశారు. పీఏఎఫ్‌ఐ (Public Affairs Forum of India) వంటి సంస్థలు మార్గదర్శక ప్రణాళికల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి పెట్టుబడిదారులకు తెలంగాణ అనుకూల వాతావరణం కల్పిస్తోందని ఆయన వివరించారు. తక్కువ నిబంధనలు, పారదర్శక విధానాలు, ఆధునిక సౌకర్యాలతో రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉందని తెలిపారు.
కేంద్రంతో సహకారం, అంతర్జాతీయ సంబంధాలు
ప్రధాన పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, బుల్లెట్ రైలు కనెక్టివిటీ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం కేంద్రాన్ని అభ్యర్థించినట్లు చెప్పారు. దిల్లీ పర్యటనలో ఆయన న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో కూడా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
పెట్టుబడులపై వరుస చర్చలు
రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా.. అమెజాన్, ఉబెర్, గోద్రెజ్, కార్ల్స్‌బర్గ్ వంటి మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండేతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ఆర్థిక, వాణిజ్య అవకాశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించి, మరిన్ని పెట్టుబడులు రాబట్టడమే రాష్ట్ర లక్ష్యం అని ప్రభుత్వం భావిస్తోంది.