Hyderabad: 600 ఎకరాల్లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు.. జపాన్‌లో రేవంత్ భారీ స్కెచ్
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తొలి రోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే మారుబెనీ కార్పొరేషన్‌తో కీలక చర్చలు జరిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Revanth Reddy Japan Tour
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం తొలి రోజునే కీలక పురోగతిని సాధించింది. జపాన్‌కి చెందిన ప్రముఖ సంస్థ మారుబెనీ కార్పొరేషన్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికకు ఈ దిగ్గజ సంస్థ సహకరించేందుకు సిద్ధమైంది.
Revanth Reddy in Japan
టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మారుబెనీ సంస్థ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో పార్క్ అభివృద్ధిపై కీలకంగా చర్చించారు. రూ.1,000 కోట్లతో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు, దశలవారీగా 600 ఎకరాలపై అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్పై అధికార ప్రతినిధులు సీఎం సమక్షంలో సంతకాలు చేశారు. ఈ పార్క్ ద్వారా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ రంగాల్లో అనేక మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులకు ముందుకురానున్నాయి.
Revanth Reddy in Japan
మొత్తం రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి 30 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఫ్యూచర్ సిటీలో మొదటి పార్క్ ఇదే. ఇది తెలంగాణ అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యానికి తగిన ఉపాధి లభిస్తుంది. మారుబెనీ పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది” అన్నారు.
Revanth Reddy in Japan
మారుబెనీ కంపెనీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా ఎదుగుతున్న ప్రాంతం. ఇక్కడి అవకాశాలను వినియోగించుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చూపిన దార్శనికత అభినందనీయం” అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాల్లో వ్యాపార విస్తరణ కలిగిన మారుబెనీ, 410 గ్రూప్ కంపెనీలు, 50,000 మందికి పైగా ఉద్యోగులతో అనేక రంగాల్లో సేవలందిస్తోంది. ముఖ్యంగా ఫుడ్, మైనింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, మౌలిక వసతులు, ఏరోస్పేస్ రంగాల్లో ఈ సంస్థ ప్రముఖంగా పనిచేస్తోంది.
కాగా సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. సోని కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, వీఎఫ్‌ఐ, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ఇందుకు సోనీ గ్రూప్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.