Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
Indias Richest District : ఎకనామిక్ సర్వే 2024-25 ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా తెలంగాణలోని రంగారెడ్డి నిలిచింది. ఇక్కడ తలసరి ఆదాయం రూ. 11.46 లక్షలు కాగా, దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో వెనుకబడింది.

Rangareddy: ఢిల్లీని దాటేసిన తెలంగాణ జిల్లా.. దేశంలోనే రిచెస్ట్ ఇదే !
దేశంలో అత్యంత సంపన్నమైన జిల్లా ఏది? అనే ప్రశ్న వస్తే సాధారణంగా ముంబై, ఢిల్లీ లేదా బెంగళూరు పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ, తాజా గణాంకాలు ఈ అంచనాలను తలకిందులు చేశాయి. ఎకనామిక్ సర్వే (Economic Survey 2024-25) ప్రకారం, తలసరి ఆదాయం (Per Capita Income) విషయంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై వంటి మెట్రో నగరాలను వెనక్కి నెట్టి రంగారెడ్డి జిల్లా ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లాల జాబితాలో గురుగ్రామ్, బెంగళూరు అర్బన్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), సోలన్ వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి.
టాప్ లో తెలంగాణ జిల్లా రంగారెడ్డి.. కారణాలివే
ఎకనామిక్ సర్వే 2024-25 రిపోర్టు ప్రకారం, రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 11.46 లక్షలుగా నమోదైంది. అంటే ఈ జిల్లాలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి రూ. 11.46 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ స్థాయిలో ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం ఐటీ సెక్టార్ అని నిపుణులు భావిస్తున్నారు.
జిల్లాలో విస్తరించిన ప్రముఖ టెక్ పార్కులు, బయోటెక్, ఫార్మాస్యూటికల్ కంపెనీల కారణంగా ఇక్కడి ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేశ రాజధాని ఢిల్లీ తలసరి ఆదాయం రూ. 4,93,024 మాత్రమే. అంటే ఢిల్లీ కంటే రంగారెడ్డి జిల్లా వాసుల ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది.
రెండో స్థానంలో హర్యానాలోని గురుగ్రామ్
తలసరి ఆదాయం విషయంలో హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం రూ. 9.05 లక్షలుగా ఉంది. గురుగ్రామ్ పూర్తిగా కార్పొరేట్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
ఇక్కడ బహుళజాతి సంస్థల (MNC) కార్యాలయాలు, బీపీఓ (BPO) సంస్థలు అధికంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ఉద్యోగాలు చేసే వారి సంపాదన దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈ నగరానికి సమీపంలోనే సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్ కూడా ఉండటం గమనార్హం.
జపాన్ ఆదాయంతో పోటీ పడుతున్న నోయిడా
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడి తలసరి ఆదాయం ఏడాదికి రూ. 8.48 లక్షలుగా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఇదే.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తలసరి ఆదాయం విషయంలో గౌతమ్ బుద్ధ నగర్ జపాన్‌తో సమానంగా పోటీ పడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. జపాన్ అంటే హై ప్రొడక్టివిటీ, హై శాలరీలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు నోయిడాలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోందని అర్థం. పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడి ఆదాయ వృద్ధికి దోహదపడ్డాయి.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక జిల్లాలు
ఈ జాబితాలో నాలుగో స్థానంలో హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో ప్రజల సగటు ఆదాయం రూ. 8.10 లక్షలు. ఇది దేశంలోనే నాలుగో అత్యంత ధనిక జిల్లాగా గుర్తింపు పొందింది.
ఐదో స్థానంలో ఐటీ హబ్ బెంగళూరు అర్బన్ నిలిచింది. కర్ణాటకలోని బెంగళూరు నగర తలసరి ఆదాయం రూ. 8.03 లక్షలు. టెక్నాలజీ రంగం విస్తరణ బెంగళూరు ఆదాయానికి ప్రధాన వనరుగా ఉంది.
దేశంలోని ఇతర సంపన్న జిల్లాల జాబితాను పరిశీలిస్తే..
- ఆరవ స్థానం: నార్త్, సౌత్ గోవా. ఈ రెండు జిల్లాల్లో ప్రజల తలసరి ఆదాయం సుమారు రూ. 7.63 లక్షలుగా ఉంది.
- ఏడవ స్థానం: సిక్కింలోని గ్యాంగ్‌టక్. ఇక్కడి తలసరి ఆదాయం రూ. 7.46 లక్షల దరిదాపుల్లో ఉంది. సిక్కింలోని నామ్చి, మంగన్, గ్యాల్షింగ్ జిల్లాలు కూడా అధిక ఆదాయం కలిగిన జాబితాలో ఉన్నాయి.
- ఎనిమిదవ స్థానం: కర్ణాటకలోని మంగళూరు. ఇక్కడి తలసరి ఆదాయం రూ. 6.69 లక్షలు.
- తొమ్మిదవ స్థానం: ముంబై. దేశ ఆర్థిక రాజధానిలో నివసించే వారి తలసరి ఆదాయం రూ. 6.57 లక్షలు.
- పదవ స్థానం: అహ్మదాబాద్. గుజరాత్‌లోని ఈ నగరంలో తలసరి ఆదాయం రూ. 6.54 లక్షలు.
ఈ గణాంకాలను బట్టి చూస్తే, దేశంలో అత్యధికంగా సంపాదించే జిల్లాల టాప్ 10 జాబితాలో ఢిల్లీ పేరు లేకపోవడం గమనించదగ్గ విషయం. రంగారెడ్డి జిల్లా ప్రగతి తెలంగాణ దూసుకుపోతున్న తీరుకు అద్ధంపడుతున్నాయి.

