- Home
- Telangana
- Rain Alert: అత్యంత భారీ వర్షాలు.. అడుగు బయటపెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి
Rain Alert: అత్యంత భారీ వర్షాలు.. అడుగు బయటపెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు ప్రవేశించిన ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినా తర్వాత ఆ లోటును తీరుస్తూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలో కొనసాగుతోన్న వర్షాలు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలుగా మారాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించింది.
KNOW
అల్పపీడనం ఏర్పడే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బుధవారం నుంచి ఇది వాయుగుండంగా బలపడే అవకాశముందని, శనివారం నాటికి తీరం తాకవచ్చని స్కైమెట్ సహా పలు వాతావరణ సంసంస్థలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 20 వరకు రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత వర్షపాతం సంభవించే అవకాశం ఉంది.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉండటంతో పాటు, ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం
సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కుండపోత వాన కురవడంతో రోడ్లన్నీ నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఇళ్లలోకి నీరు చేరి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ముసురు వాతావరణం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా..
ఇదిలా ఉంటే అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ వంటి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వానలు నమోదయ్యాయి.