Hyderabad LIfe: ఇదేందయ్యా ఇదీ... ఇది నేనెప్పుడు చూడ్లా!
ఎక్కడా చూడని వింతలు మన దేశంలో కనిపిస్తుంటాయి. అలాంటి వింత సంఘటలు కనీసం ఒక్కసారయినా ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి. అలాంటిదే ఈ ఫన్నీ స్టోరీ...

Hyderabad : ఒకరి దగ్గరుండే వాహనాన్ని బట్టి వారి స్టేటస్ ఏంటో చెప్పేవాళ్లు... కారు వుంటే ధనవంతులు, బైక్ వుంటే మధ్యతరగతివారు, ఇక బస్సులు, ఆటోల్లో తిరిగేవారు దిగువ మధ్యతరగతి, కాలినడకన తిరిగేవారు పేదవారు. ఇలా సమాజంలో వారి వాహనాన్ని బట్టి హోదా దక్కేది. ఇది ఒక్కప్పటి మాట... ఇప్పుడు అంతా మారిపోయింది. మనుషుల జీవన తీరు మారడమే ఇందుకు కారణం.
వాహనాన్ని చూసి మనిషిని అంచనా వేసే రోజులు పోయాయి... ఇప్పుడంతా సోకుల జమానా నడుస్తోంది. దొరబాబులా తయారై యాటిట్యూట్ ప్రదర్శించేవారు పెరిగిపోయారు. బాగా డబ్బున్నోళ్లు హుందాగా చిన్నచిన్న కార్లలో తిరుగుతుంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారిలో కొందరు ఆడంబరాలకు పోయి పెద్దపెద్ద కార్లతో హంగామా చేస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే కారు బయటకు తీయకున్నా సరే... ఇంటిముందు వుంటే చాలు అదే తమ స్టేటస్ సింబల్ గా భావించేవారు పెరిగిపోయారు.
పట్నాల్లోనే కాదు పల్లెటూళ్లలోనూ ఈ సంస్కృతి పెరిగింది. షోరూంవాడు జీరో డౌన్ పేమెంట్ తో కార్లు ఇచ్చేయడంతో ఈఎంఐ కట్టుకునే స్తోమత లేకున్నా ఇప్పటికయితే ఇంటికి తీసుకువెళదాం... తర్వాత ఏదయితే అదయ్యింది అనే మనస్తత్వం పెరిగిపోయింది. దీంతో పల్లెల్లోనే ఇళ్లముందు కార్లు కనిపిస్తున్నారు... ఇక పట్టణాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్ వంటి మహానగరాల్లో మరీ దారుణం... ప్రతి ఇంటిముందు పక్కా కారు వుండాల్సిందే. ఇంట్లో పార్కింగ్ స్థలం లేకున్నా కారు తీసుకుని రోడ్డుపై పెట్టెస్తారు... అటో కారు, ఇటో కారు సగం రోడ్డును ఆక్రమిస్తాయి... మరో కారు అటుగా వచ్చిందంటే ఎక్కడ తగులుతుందోనని చూసుకుంటూ బిక్కుబిక్కుమంటూ వెళ్లాలి. ప్రస్తుతం హైదరాబాద్ లోనే కాదు దేశంలోని ప్రతి నగరంలోనూ ఇదే పరిస్థితి.
చివరకు కార్లలో పప్పులు ఎండబెట్టుకునే పరిస్థితి :
ఇలా హైదరాబాద్ లో ప్రతి ఇంటిముందు ఒకట్రెండు కార్లు నిలబడివుండే వీధిగుండా వెళుతుండగా నా కంటికి ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఓ ఇంటిముందు పార్క్ చేసివున్న మంచి ఖరీదైన కారులో కొన్ని వస్తువులు వింతగా కనిపించాయి. అవేంటని మరింత దగ్గరకు వెళ్లిచూడగా పప్పులు, అప్పడాలు. ముందుసీట్లను కూడా ప్లాట్ గా చేసేసి వెనకసీట్లో వాటిని పెట్టారు. అది చూడగానే 'ఇదేందబ్బా ఇదీ... ఇది నేనెప్పుడు చూడ్లా' అనే డైలాగ్ గుర్తుకువచ్చింది.
ఆ కారువద్దే నిలబడి తలపట్టుకోవడం నా వంతయ్యింది. ఎంత ఆలోచించినా కారులో అలా పప్పులు, అప్పడాలు ఎందుకు పెట్టారో అంతుచిక్కలేదు. ఎక్కడికయినా తీసుకోళ్లడానికి పెట్టారని అనుకుందామా అంటే ఆ పప్పులు మూటగట్టి లేవు. సీటు మొత్తం పరిచి వున్నాయి. ఇలా ఎందుకలా పెట్టారో తెలియక సతమతం అవుతుంటే ఆ ఇంట్లోంచి ఓ మహిళ బయటకు వచ్చింది. ఆమెను అడిగితేగాని అసలు సంగతేందో అర్థంకాలేదు... ఆమె మాటలు విని అవాక్కవడం నా వంతయ్యింంది.
ఇంతకు కారులో పప్పులు, అప్పడాలు అలా పెట్టడంవెనకున్న బ్రహ్మరహస్యం ఏంటో తెలుసా? వాటిని ఎండకు పెట్టారట. డాబాపై వాటిని ఎండబెడితే పక్షులు తినకుండా కాపలా కాయాలి... అలాగని ఎండబెట్టకుంటే పాడవుతాయి. మరి ఏం చేద్దామని ఆలోచిస్తుండగా చాలారోజులుగా బయటకు తీయకుండా వున్న కారు గుర్తు వచ్చిందట. వెంటనే ఆ మహాతల్లికి ఓ ఆలోచన వచ్చిందట.
కారులోనే పప్పులను ఎండబెడితే ఎలా వుంటుంది... కారు అద్దాల గుండా సూర్యరశ్మి లోపలికి వెళుతుంది... డోర్లన్ని మూసివుంటాయి కాబట్టి పక్షుల బెడద వుండదు అంటే కాపలా కాయాల్సిన అవసరం లేదు. ఇక కారు ఎలాగూ బయటకు తీయరు. కాబట్టి ఇదే సేఫ్ ప్లేస్ గా భావించిన ఆ ఇల్లాలు కారులు పప్పులు, అప్పడాలు వడియాలు ఎండబెట్టుకుంటోందట. ఆమె మాటలు విని నా రెండు చేతులు జేబులో పెట్టుకుని అక్కడినుండి వెళ్ళిపోయా.
మన ఆడోళ్ల ఆలోచనకు జోహార్లు :
ఈ ఘటన తర్వాత రెండు విషయాలు అర్థమయ్యాయి. మన ఆడాళ్లు ఎంత తెలివిగా ఆలోచిస్తారు ... ఏ బిజినెస్ స్కూళ్లు, విదేశీ విద్యలు వారిముందు పనిచేయవని. ఇంటిముందు కారు ఖాళీగా వుంటోందని పప్పులు ఎండబెట్టుకోవాలన్న ఆమె ఆలోచన అద్భుతం. ఆ కారులో పప్పులు ఆరబెట్టడం వల్ల కాపలా లేకుండానే పని జరిగిపోయింది... ఆమె తెలివిగా ఆలోచించి శ్రమ తగ్గించుకుంది. ఇలాంటివి చూసే ఆడాళ్లకు జోహార్లు చెప్పాలనిపిస్తుంది... వాళ్ళకు వంద ఆస్కార్ లు, వేల పద్మ అవార్డులు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది.
ఇక రెండో విషయం ఏంటంటే కార్లు ఎంతలా పెరిగిపోయాయి... కేవలం వీటి స్టేటస్ సింబల్ గా వాడుకునే ప్రయత్నం జరుగుతోందని అర్థమయ్యింది. అవసరం లేకపోయినా, పార్కింగ్ స్థలం లేకున్నా కారు కొని ఇంటిముందు పెడుతున్నారు... అది చూసినవారు వీళ్ళు చాలా గొప్పోళ్లు అనుకోవాలనేది చాలామంది ఫీలింగ్. ఇలా గొప్పలకు పోయి చాలామంది కారు తీసుకుని ఇంటిముందు పెట్టుకోవడం తప్ప దాన్ని తీసింది లేదు... నడిపింది లేదు. ఇలా ఒకప్పటి కారు ఇప్పుడు బజారుకు చేరిందని అర్థమయ్యింది.