- Home
- Telangana
- Movie Piracy: సినిమా పైరసీ చేసే వారికి డబ్బులెలా వస్తాయో తెలుసా? దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్న తెలంగాణ పోలీసులు
Movie Piracy: సినిమా పైరసీ చేసే వారికి డబ్బులెలా వస్తాయో తెలుసా? దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్న తెలంగాణ పోలీసులు
Movie Piracy: సినిమా ఇలా థియేటర్లలోకి వస్తుందో లేదో అలా పైరసీ వెబ్‌సైట్స్‌లో దర్శనమిస్తోంది. ఇంత టెక్నాలజీ పెరిగినా ఈ ముఠా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా తెలంగాణ సైబర్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు చేశారు.

అంతర్జాతీయ పైరసీ ముఠా పట్టు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతి పెద్ద అంతర్జాతీయ సినిమా పైరసీ నెట్‌వర్క్‌ను రద్దు చేశారు. ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి, వారి దగ్గర నుంచి హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ద్వారా తెలుగు, హిందీ, తమిళ సినిమాలను పైరసీ చేయడంతో సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టాలు పడ్డాయి. ఈ వివరాలన్నింటినీ నగర కమిషనర్ సీవీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టం
నగర కమిషనర్ సీవీ ఆనంద్ వివరాల ప్రకారం, ఈ ముఠా పని 18 నెలల్లో 40కి పైగా సినిమాలను రిలీజ్ రోజునే లీక్ చేసింది. ఇందులో ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఏకంగా రూ. 3700 కోట్లు నష్టపోయింది. మొత్తం ఇండస్ట్రీకి 22,400 కోట్లకు పైగా నష్టం వచ్చిందని గుర్తించారు. హిట్, కుబేరా, హరిహరవీరమల్లు సినిమాల పైరసీ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఆధునిక పద్ధతుల ద్వారా పైరసీ
ముఠా సభ్యులు థియేటర్లలోకి ఏజెంట్లను పంపి పాప్‌కార్న్, చొక్కా జేబులు, కోక్, టిన్ లలో హై-ఎండ్ కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు. శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్లను దొంగలించారు. రికార్డింగ్ సమయంలో మొబైల్ స్క్రీన్ లైట్ ఆఫ్ చేసే యాప్‌లను ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా పనులు చేశారు.
వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.?
పైరసీ చేసే వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే సందేహం వస్తుండొచ్చు. అయితే పైరసీ ప్రధాన ఆదాయ వనరు బెట్టింగ్ యాప్స్. సాధారణంగా పైరసీ మూవీ ప్లే అయ్యే సమయంలో బెట్టింగ్ యాప్స్‌కి చెందిన ప్రకటనలు వస్తుంటాయి. ఈ యాప్స్ యజమానులు క్రిప్టో కరెన్సీ ద్వారా వారి ఏజెంట్లకు కమీషన్ చెల్లిస్తున్నారు. దీంతో పైరసీకి పాల్పడిన వారు పెద్ద లాభాలను పొందారు. దీంతో చాలా మంది ఈ పైరసీ రంగంలోకి దిగుతున్నారు.
మొదలైన అరెస్టులు
ఈ కేసు '#సింగిల్' సినిమా పైరసీ ఫిర్యాదు ఆధారంగా ప్రారంభమైంది. జూలై 3న వనస్థలిపురం నివాసి జానా కిరణ్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు. విచారణలో దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్ వంటి దేశాల నుంచి ముఠా కార్యకలాపాలు జరుగుతున్నట్లు, వారి IP అడ్రస్‌లను ఉపయోగిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చారు. అయితే తాజాగా తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ముఠాను పట్టుకున్నారు.