వదలని ముసురు.. మరో 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు
గత కొన్ని రోజులుగా తెలంగాణలో వరుసగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా తెలంగాణ వ్యాప్తంగా వాతావరంణం చల్లగా ఉంటుందని, వచ్చే 5 రోజులు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

కొనసాగుతోన్న రుతుపవన ద్రోణి
తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కి.మీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 27 వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జల్లులు నమోదైనట్లు సమాచారం.
ఉరుములు, మెరుపులతో వర్షాలు
శుక్రవారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనథ్‌లో 2.95 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 2.55, కన్నాయిగూడెంలో 2.33, గట్టులో 1.61, భూపాలపల్లి జిల్లా పలిమెలలో 1.60 సెం.మీ వర్షపాతం నమోదైంది.
వచ్చే 5 రోజులు వర్షాలు
భారత వాతావరణశాఖ తాజా బులిటెన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్–తెలంగాణల్లో వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా. తమిళనాడు, యానాంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉండగా, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని IMD స్పష్టం చేసింది. కోస్తాంధ్రలో 25, 26 తేదీల్లో భారీ వర్షం, 26, 27 తేదీల్లో కర్ణాటక, కేరళల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
బలమైన గాలులు
అరేబియా సముద్రంలో గంటకు 47 కిలోమీటర్ల వేగంతో, బంగాళాఖాతంలో 39 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో గాలివేగం 13 కి.మీ, తెలంగాణలో 15 కి.మీగా ఉండనుంది. ఉష్ణోగ్రతల పరంగా చూస్తే, ఏపీలో 31–34 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుండగా, తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, తిరుపతి ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉండనుంది. తెలంగాణలో 29–31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.