- Home
- Telangana
- Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలే లేవు... అయినా వరదనీటితో పోటెత్తుతున్న కృష్ణమ్మ
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలే లేవు... అయినా వరదనీటితో పోటెత్తుతున్న కృష్ణమ్మ
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేమీ కురవలేదు… కానీ ఇరు రాష్ట్రాల్లోనూ నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా కృష్ణా నది వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది… ఆ నదిపై జలాశయాలు నిండుకుండల్లా మారాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే...
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల వర్షాలు ఆశాజనకంగానే ఉన్నాయి. జూన్ లో అసలు వర్షాల జాడే లేకుండా పోవడంతో ఈసారి వానాకాలం కొంపముంచేలా ఉందని తెలుగు ప్రజలు కంగారుపడిపోయారు. మరీముఖ్యంగా వర్షాకాలం ఆరంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటంతో తెలుగు రైతులకు ఏంచేయాలో దిక్కుతోచలేదు. వ్యవసాయ పనులు జోరుగా సాగాల్సిన సమయంలో వర్షాలు లేక రైతులు ఢీలా పడిపోయారు. ఇలా జూన్ నిరాశను మిగల్చగా జులై మాత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో మళ్ళీ ఆశలు రేకెత్తిస్తోంది.
జులై ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి... పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. అయితే ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గినా రెండుమూడు రోజుల్లో మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మోస్తరు వర్షాలు మొదలై భారీ వర్షాలుగా మారతాయని... జులై మొత్తం పుష్కలంగా వానలు పడతాయంటూ గుడ్ న్యూస్ తెలిపింది. మరి ఇవాళ (శనివారం) తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
రుతుపవనాలు చురుగ్గా మారాయి... వీటికి బంంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి తోడయ్యింది. దీంతో తెలంగాణలో ఇవాళ(శనివారం) వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని... కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికాారులు తెలిపారు. ఇక వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ వాతావరణ సమాచారం
హైదరాబాద్ లో చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందట. శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ లో కూడా ఇదే పరిస్ధితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లోనూ అక్కడక్కడా జల్లులు పడే అవకాశాలున్నాయి. మొత్తంగా తెలంగాణలో మోస్తరు వర్షాలుంటాయని... వానలు పడే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అనుకూల పరిస్థితులు ఉండటం... రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు బాగానే కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ రెండుమూడు రోజులు భారీ వర్షాలేమీ ఉండవని... అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కానీ రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకుంటాయని... భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని గుడ్ న్యూస్ చెబుతోంది.
ఇవాళ (శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులకు ఛాన్స్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘాలతో కప్పేసి ఉండటంతో రాష్ట్రంలో చల్లగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం
తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేకున్నా కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా నదిపై గల జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఇలా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 67,019 క్యూసెక్కులుగా ఉంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 876.90 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.