- Home
- Telangana
- మియాపూర్ భూముల వ్యహారం ఏంటి? అసలు కథ ఎప్పుడు మొదలైంది? 550 ఎకరాలు ఏం చేయనున్నారు?
మియాపూర్ భూముల వ్యహారం ఏంటి? అసలు కథ ఎప్పుడు మొదలైంది? 550 ఎకరాలు ఏం చేయనున్నారు?
Miyapur Land Case: హైదరాబాద్‌లోని మియాపూర్ భూముల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి కీలక విజయం లభించింది. ఇంతకీ వివాదం ఏంటో తెలుసా?

1995లో మొదలైన వివాదం.. అసలు సమస్య ఏంటి.?
హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో ఉన్న వందల ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారం 1995 నుంచి న్యాయస్థానాల్లో కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని భూములపై హక్కుల విషయంలో వివాదం నెలకొంది. సెటిల్మెంట్ రికార్డుల ప్రకారం ఈ భూములు ప్రభుత్వ పోరంబోకు భూములుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే, పహాణీ రికార్డుల్లో కొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదయ్యాయి. దీంతో అసలు భూములపై హక్కులు ఎవరికి చెందుతాయనే అంశం వివాదానికి కారణమైంది. ప్రభుత్వ భూముల రికార్డుల్లో మార్పులు చేసి వాటిని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరిగాయన్నది ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణ. ఈ భూములపై హక్కుల వివాదం చివరకు సుదీర్ఘ న్యాయపోరాటానికి దారితీసింది.
రూ.50 వేల కోట్ల విలువైన భూములు.. ఆరోపణలు ఏమిటి.?
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో.. మియాపూర్ భూముల వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ భూములను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బంధువులు ఈ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాదరావు ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల పాత్రపైనా ఆరోపణలు చేశారు. భూముల విషయంలో కొంతమంది అధికారులను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించారని, ఈ కేసులో కొందరు అధికారులు అరెస్టయ్యారని తెలిపారు. అయితే, ఇవి ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు. ఈ వివాదానికి సంబంధించిన అసలు అంశం మాత్రం భూములపై హక్కులు ఎవరికి చెందుతాయనే ప్రశ్న. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి అనుకూలంగా ఈ అంశం పరిష్కారమైంది.
సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఊరట
దాదాపు 31 ఏళ్లుగా కొనసాగుతున్న మియాపూర్ భూముల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలక మలుపుగా మారింది. 550 ఎకరాల భూమిపై ప్రభుత్వ హక్కులకు అనుకూలంగా తీర్పు రావడంతో, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులకు మార్గం సుగమమైంది. ఈ తీర్పును చారిత్రాత్మకంగా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి.. బలమైన న్యాయవాదనలతో ప్రభుత్వ భూములను కాపాడుకోగలిగామని చెప్పారు. తీర్పు వెలువడిన వెంటనే భూములను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ భూముల విలువ సుమారు రూ.50 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇంతటి విలువైన ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోగలిగామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
550 ఎకరాల్లో 400 ఎకరాలు ఖాళీగా.. స్వాధీన ప్రక్రియ ప్రారంభం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2026 అక్టోబర్ 30న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మియాపూర్ భూముల స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధీనంలో ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం 550 ఎకరాల్లో సుమారు 400 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు వివరించారు. భూముల చుట్టూ ఇప్పటికే ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో ఏవైనా నిర్మాణాలు ఉన్నాయా.? భూముల ప్రస్తుత పరిస్థితి ఏమిటి.? అనే అంశాలను గుర్తించేందుకు హెచ్‌ఎండీఏ సర్వే చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం భూములపై ప్రభుత్వ నియంత్రణను పటిష్ఠం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.
మియాపూర్‌కే పరిమితం కాని భూస్వాధీన చర్యలు
ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు మియాపూర్‌కే పరిమితం కాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఎంజీ భూముల కేసులోనూ ప్రభుత్వానికి అనుకూల ఫలితం వచ్చిందని చెప్పారు. మంచిరేవులలో 143 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని, వాటిలో 50 ఎకరాలను యంగ్ ఇండియా స్కూల్‌కు కేటాయించినట్లు వెల్లడించారు. భూపాలపల్లిలో 104 ఎకరాల భూమిని తిరిగి పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని రెండు గ్రామాల్లోనూ భూ సర్వేలు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు 388 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోగా, మరో 345 ఎకరాలను గుర్తించినట్లు చెప్పారు. గత మూడేళ్లలో మొత్తం రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు ఆయన వెల్లడించారు.
ఈ భూములను ప్రభుత్వం ఏం చేయబోతోంది.?
మియాపూర్ భూములను స్వాధీనం చేసుకోవడంతో తదుపరి వాటిని ఎలా వినియోగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ భూములను అవసరాన్ని బట్టి విద్య, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే భూములను వేలం వేసి, తద్వారా వచ్చే ఆదాయాన్ని దళితులు, బహుజనుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూ ఆక్రమణలకు పాల్పడే ప్రయత్నాలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మరోవైపు, ఎర్రవల్లి సమీపంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరుతో ప్రత్యేక కాలనీ నిర్మించనున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.





