నాగార్జునసాగర్‌పై బీజేపీ ఫోకస్: దుబ్బాక రిపీటయ్యేనా?
వరుస ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు కూడ సిద్దమౌతోంది. ఈ ఎన్నికల్లో కూడ ప్రత్యర్ధులను దెబ్బకొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కూడ బీజేపీ కేంద్రీకరించింది.దుబ్బాక తరహాలో కూడ సాగర్ లో ఫలితం వచ్చేలా ఆ పార్టీ ప్రణాళికలు సిద్దం చేసుకొంటుంది.
దుబ్బాకకు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. రఘునందన్ రావు గతంలో ఈ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయనపై ఉన్న సానుభూతితో పాటు టీఆర్ఎస్ అభ్యర్ధిపై వ్యతిరేకత ఇతరత్రా కారణాలు కూడ బీజేపీకి కలిసి వచ్చాయి.
అయితే నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన అభ్యర్ధి బరిలో ఉన్నాడు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రమైన అభ్యర్ధిని బరిలో దింపింది.చివరి నిమిషంలో దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. కానీ సాగర్ లో జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. టీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్ధులు కూడ జానారెడ్డిని ఢీకొట్టాలంటే అంతా ఆషామాషీ కాదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటినుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు సంకేతాలు ఇచ్చేందుకు గాను అంది వచ్చిన ప్రతి అవకాశాన్నిబీజేపీ నాయకత్వం ఉపయోగించుకొంటుంది.గత ఏడాదిలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను గెలుచుకొంది.
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా నివేదితా రెడ్డి పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో ఆమెకు 2 శాతం ఓట్లు (2675)మాత్రమే దక్కాయి. ఈ దఫా కూడ ఆమె ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు.
టీడీపీ నుండి బీజేపీలో చేరిన అంజయ్యయాదవ్ కూడ సీటు ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో అంజయ్య యాదవ్ ఈ స్థానం నుండి పోటీ చేసి 27,858 ఓట్లు దక్కించుకొన్నాడు.త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి బరిలో దిగుతున్నారు.టీఆర్ఎస్ ఇంకా అభ్యర్ధిని నిర్ణయించలేదు. బీజేపీ కూడ ఇంకా అభ్యర్ధి వేటలో ఉంది.
జానారెడ్డి ప్రధాన అనుచరుడు డాక్టర్ రవికుమార్ నాయక్ ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 27వ తేదీన రవికుమార్ బీజేపీలో చేరనున్నారు. గత నాలుగేళ్లలో ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో డాక్టర్ రవికుమార్ పార్టీని వీడడం కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలోనే జానారెడ్డి అనుచరులుగా ఉన్న కొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోంది.
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ కు మంచి పట్టున్న నియోజకవర్గం. ఈ స్థానం నుండి జానారెడ్డి ఏడుసార్లు విజయం సాధించారు. రెండు దఫాలు ఇదే స్థానం నుండి ఆయన ఓడిపోయారు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీ సోషల్ మీడియాలో కూడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేసి ఆన్ లైన్ వేదికగా ప్రచారం చేస్తోంది. బూత్ లెవల్ వరకు ప్రచారాన్ని తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.ప్రత్యర్ధి పార్టీల బలాలు, బలహీనతలను అంచనా వేసుకొంటూ బీజేపీ ఎన్నికల రంగంలోకి ముందుకు వెళ్తోంది.