కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా.? అసలు విషయం ఏంటంటే..
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా.? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఫార్ములా ఈ కేసును కాంగ్రెస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

ఫార్ములా–ఈ కేసులో కీలక మలుపు
ఫార్ములా–ఈ రేసింగ్‌కు సంబంధించిన అవకతవకల కేసులో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రూ.54.88 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి చెల్లించారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. గవర్నర్ కార్యాలయం నుంచి రెండు రోజుల క్రితమే ఆమోద పత్రం ప్రభుత్వానికి చేరిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏసీబీ ఇప్పటికే ఈ కేసులో అవసరమైన పత్రాలు సేకరించింది. గవర్నర్ అనుమతి వచ్చినందుకు ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని విచారణాధికారులు భావిస్తున్నారు.
అసలేంటీ కేసు.?
2022లో హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ఫార్ములా–ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒప్పందం బ్రిటన్‌కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్, గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్‌జెన్, ఎంఏయూడీ మధ్య జరిగింది. ఒప్పందం ప్రకారం రేసింగ్ ట్రాక్‌తో పాటు అభివృద్ధి పనుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్టుకు రూ.110 కోట్ల స్పాన్సర్ ఫీజుతో పాటు మౌలిక సదుపాయాల కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేయాలని అగ్రిమెంట్‌లో సూచించారు. మొత్తం రూ.160 కోట్లు హెచ్‌ఎండీఏ నుంచి కేటాయించగా, నేరుగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు డాలర్ల రూపంలో నిధుల బదిలీ జరగడం రూల్స్‌కు విరుద్ధమని ఏసీబీ గుర్తించింది. ఈ బదిలీపై ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా హెచ్‌ఎండీఏపై రూ.8.07 కోట్ల పెనాల్టీ కూడా పడింది
10 మందిపై ఫిర్యాదు
ఈ కేసులో మొత్తం 10 మందిపై ఫిర్యాదు నమోదు అయ్యింది. వీరిలో.. కేటీఆర్ – A1 మాజీ హెచ్‌ఎండీఏ డైరెక్టర్ అర్వింద్ కుమార్ – A2 మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి – A3 ఫార్ములా–ఈ కంపెనీ ప్రతినిధులు నెక్ట్స్‌జెన్ కంపెనీ అధికారులు ఏసీబీ ఇప్పటికే వారిని పలుసార్లు విచారించింది. ఫార్ములా–ఈ ప్రతినిధులను ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నించారు. తాజాగా కేటీఆర్ (KTR) ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అనుమతించిన విషయం తెలిసిందే.
నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్
దీనిపై స్పందించిన కేటీఆర్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ కేసులో తన తప్పు ఏమీ లేదని, తనను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వం చేయదంటూ చెప్పుకొచ్చారు. ఇక అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్‌కైనా సిద్ధమని తెలిపిన కేటీఆర్.. ఇది ముమ్మాటికీ ఇది రాజకీయ కుట్ర అని, కాంగ్రెస్–బీజేపీ కలిసి తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

