- Home
- Telangana
- Kalvakuntla Kavitha : కేసీఆర్ కూతురు, అల్లుడు ఏం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా..?
Kalvakuntla Kavitha : కేసీఆర్ కూతురు, అల్లుడు ఏం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా..?
Kalvakuntla Kavitha : బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా వంటి పరిణామాలతో కల్వకుంట్ల కవిత పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతోంది. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత జీవితం, చదువు, రాజకీయ జీవితం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కల్వకుంట్ల కవిత గురించి ఆసక్తికర విషయాలు..
Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. డిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడం నుండి తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంవరకు కవిత రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. చివరకు ఒకప్పుడు చక్రంతిప్పిన పార్టీనుండే ఆమెను సస్పెండ్ చేశారు.. ఇంకా చెప్పాలంటే గెంటేశారు. తండ్రిచాటు బిడ్డగా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు... దీనికి వ్యతిరేకంగా మరోపార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారు.
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత ఇటీవల శాసనమండలికి హాజరయ్యారు... తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ ను కోరారు. ఈ సందర్భంగా నిండు సభలోనే ఆమె కన్నీరు పెట్టుకుంటూ... సొంత తండ్రి పాలనపైనే విమర్శలు చేశారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లో రాలేదని... ఉన్నత చదువులు చదివినా ప్రజలకు సేవ చేయాలని భావించి రాజకీయాల్లోకి వచ్చానని అనేలా మాట్లాడారు. ఇలా శాసన మండలిలో కవిత ప్రసంగం వైరల్ గా మారింది.
అయితే కవిత రాజకీయ జీవితం గురించి అందరికీ తెలుసు... కానీ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆమె ఎక్కడ, ఏం చదువుకున్నారు? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అనేది చాలామందికి తెలియదు. ఈ ఆసక్తికర వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కవిత ఏం చదువుకున్నారు..?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు 1978 మార్చి 13న రెండో సంతానంగా కవిత జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే సాగింది... స్టాన్లీ బాలికల స్కూల్లో ప్రాథమిక విద్యాబ్యాసం పూర్తిచేశారు. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత అన్న కేటీఆర్ మాదిరిగానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.
అమెరికాలోని మిస్సిసిప్పి యూనివర్సిటీ నుండి 2001 లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తిచేశారు కల్వకుంట్ల కవిత. ఇలా ఉన్నత చదువులు పూర్తయ్యాక కూడా కొంతకాలం అమెరికాలో ఉన్నారు... సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. అయితే తండ్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సమయంలో కవిత ఇండియాకు వచ్చేశారు. 2006 లో తెలంగాణ జాగృతిని ఏర్పాటుచేసి రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు కృషిచేశారు.
కవిత వ్యక్తిగత జీవితం
కల్వకుంట్ల కవితకు అమెరికాలో ఉండగానే 2003 వివాహం జరిగింది... భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కూడా సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. ఇండియాలో వివాహం చేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి అమెరికా వెళ్లిపోయారు... 2006 వరకు అక్కడే ఉన్నారు. అయితే రాజకీయాలపై ఆసక్తితో కవిత, వ్యాపారంపై ఆసక్తితో అనిల్ దంపతులు ఇండియాకు తిరిగివచ్చారు... ప్రస్తుతం ఇద్దరూ తమతమ రంగాల్లో కొనసాగుతున్నారు.
కవిత-అనిల్ దంపతులను ఇద్దరు మగపిల్లలు సంతానం. పెద్దబ్బాయి ఆదిత్య అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటున్నాడు... గతేడాది ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. చిన్నబ్బాయి ఆర్య తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ లో ఉంటున్నాడు... ఇక్కడే చదువుకుంటున్నాడు.
కల్వకుంట్ల కవిత రాజకీయ జీవితం
అమెరికా నుండి తిరిగివచ్చాక కవిత రాజకీయంగా యాక్టివ్ గా మారారు... తండ్రి స్థాపించిన టిఆర్ఎస్ (ప్రస్తుతం బిఆర్ఎస్) కు అనుబంధంగా తెలంగాణ జాగృతి (ప్రస్తుతం భారత జాగృతి) స్థాపించారు... దీని ద్వారా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇలా తెలంగాణ సంస్కృతిని కాపాడే బాధ్యతలు భుజానెత్తుకుని రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవిత రాజకీయంగా మరింత స్ట్రాంగ్ అయ్యారు. తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా మారడం, తాను నిజామాబాద్ నుండి లోక్ సభకు ఎన్నికవడంతో కవిత రాజకీయ పలుకుబడి పెరిగింది. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు... కానీ తిరిగి బిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసీఆర్. ప్రస్తుతం ఈ పదవికే కవిత రాజీనామా చేశారు… సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు.

