- Home
- Telangana
- జూబ్లిహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతేశాడుగా.. ఎవరీ నవీన్ యాదవ్? అతడి సక్సెస్ స్టోరీ ఇదే
జూబ్లిహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతేశాడుగా.. ఎవరీ నవీన్ యాదవ్? అతడి సక్సెస్ స్టోరీ ఇదే
Naveen Yadav : తెలంగాణ ఏర్పాటుతర్వాత మొదటిసారి జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. బిఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగా ఎమ్మెల్యే అయిన నవీన్ యాదవ్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.

నవీన్ యాదవ్ మామూలోడు కాదు... అనుకున్నది సాధించాడు
Jibilee Hills By Election Results 2025 : కాంగ్రెస్ లో కాకలుతీరిన నేతలకు సాధ్యంకానిది ఇతడు సాధించాడు. తెలంగాణ ఏర్పాటుతర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతిన తోపు లీడర్ గా గుర్తింపుపొందాడు. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దిన్ వంటివారికి సాధ్యంకాని విజయాన్ని అతడు సాధించాడు. వంద రెండోందల బోటాబోటీ ఓట్ల మెజారిటీతో కాదు... దాదాపు 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించాడు. ఇతడు ఎవరో కాదు... జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి... కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తడబడింది లేదు... విజయం దిశగా వడివడిగా అడుగులు వేసింది. బిఆర్ఎస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది... ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పై సానుభూతి కూడా పనిచేయలేదు. ఎట్టకేలకు ఎన్నో ఓటముల తర్వాత నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కలను సాకారం చేసుకున్నారు.
ఎవరీ నవీన్ యాదవ్?
నవీన్ యాదవ్ హైదరాబాద్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబంలో 1983, నవంబర్ 17న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కస్తూరి, చిన్న శ్రీశైలం యాదవ్. ఇతడికి పెళ్లయ్యింది... నవీన్-వర్ష యాదవ్ దంపతులకు అన్ష్ యాదవ్ సంతానం. వీరి కుటుంబం యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ సమీపంలో నివాసం ఉంటోంది... ఇది జూబ్లిహిల్స్ అసెంబ్లీ పరిధిలోకే వస్తుంది. అంటే నవీన్ యాదవ్ జూబ్లిహిల్స్ లో స్థానికుడు అన్నమాట.
రియల్ ఎస్టేట్ తో గుర్తింపు
తండ్రి శ్రీశైలం యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో నవీన్ కూడా మొదట ఈ రంగంలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణలోని ప్రముఖ రియల్టర్ల సరసన చేరారు.
ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. హైదరాబాద్ కు చెందిన రాజకీయ పార్టీ AIMIM (ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్) ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు.
నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం
నవీన్ యాదవ్ మజ్లీస్ పార్టీలో 2009 చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఇలా రియల్ ఎస్టేట్ లో మాదిరిగానే రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు… మజ్లిస్ పార్టీ పెద్దల కళ్లలో పడ్డారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి నవీన్ ను బరిలోకి దింపింది మజ్లీస్. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు.
ఈ ఓటమి తర్వాత ఎంఐఎంలో నవీన్ యాదవ్ ను పక్కనబెట్టింది... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతడికి మరో అవకాశం ఇవ్వలేదు. అయినా అతడు వెనక్కి తగ్గలేదు... ఎంఐఎంకు రాజీనామా చేసిమరీ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఏ పార్టీ మద్దతు లేకుండానే ఏకంగా 18,817 ఓట్లు సాధించి తన సత్తా ఏమిటో చూపించారు. ఈ ఎన్నికల్లోనూ మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీకి సిద్దమయ్యారు నవీన్ యాదవ్... నామినేషన్ కూడా వేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దిన్ అభ్యర్థన మేరకు నామినేషన్ ను వెనక్కి తీసుకుని కాంగ్రెస్ లో చేరారు. అప్పటినుండి కాంగ్రెస్ నాయకుడిగా జూబ్లీహిల్స్ ప్రజలకు సేవలందిస్తున్నారు.
ఎట్టకేలకు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లిహిల్స్ అసెంబ్లీకి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో అజారుద్దిన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి హేమాహేమీలను కాదని నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ ఉపఎన్నికలో పోటీచేసే అవకాశం కల్పించింది. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతడు విజయాన్ని ఖాయం చేసుకున్నారు… జూబ్లీ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేశారు.