Jubilee Hills By Poll Results 2025 : జూబ్లిహిల్ప్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది… బిఆర్ఎస్ వెనకబడిపోయింది. 

Jubilee Hills By Election Results 2025 : ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా ఉన్నాయి... జూబ్లిహిల్స్ లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. నవంబర్ 11న పోలింగ్ జరగ్గా ఇవాళ (నవంబర్ 14, గురువారం) ఓట్ల లెక్కింపు జరుగుతోంది... ఇందులో మొదటినుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కనబరుస్తున్నారు. బిఆర్ఎస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది... ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఓటమి దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.

ఈసిఐ అధికారిక సమాచారం

ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా (ECI) అధికారిక సమాచారం మేరకు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. నవీన్ యాదవ్ 28,999 ఓట్లు సాధించగా బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కేవలం 22987 మాత్రమే సాధించారు. దీంతో కాంగ్రెస్ 6012 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

నాలుగో రౌండ్ ఫలితాలను కూడా ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ లీడ్ 9559 కి చేరింది. కాంగ్రెస్ కు మొత్తం 38566 ఓట్లు, బిఆర్ఎస్ కు 29007 ఓట్లు వచ్చాయి. బిజెపికి కేవలం 7296 ఓట్లు మాత్రమే వచ్చాయి.

కౌంటింగ్ కేంద్రం నుండి అందుతున్న సమాచారం

ఇక ఓట్ల లెక్కింపు జరుగుతున్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుండి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయినట్లు తెలుస్తోంది. మొదటి రౌండ్ నుండి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు నవీన్ యాదవ్... అతడి ఆధిక్యం రౌండ్ రౌండ్ కు పెరుగుతోంది. ప్రస్తుతం సగం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ 12 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉండగా ఇప్పటికే ఐదు రౌండ్స్ పూర్తయ్యాయి... మిగతా రౌండ్స్ లోనూ తమకు మంచి లీడ్ వస్తుందని... మొత్తంగా 15 నుండి 20 వేల ఓట్ల మెజారితీతో జూబ్లీహిల్స్ లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమాతో ఉన్నారు.