- Home
- Telangana
- Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలవనున్నారు.? ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలవనున్నారు.? ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్
Jubilee hills by election exit poll: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడ్డ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నిక పూర్తయింది.

ముగిసిన పోలింగ్ సమయం
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ముగిసింది. నిర్ణయించిన సమయానికి ఓటింగ్ ముగిసినా, లైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారిక సమాచారం. ఎన్నికల కమిషన్ ఈ నెల 14న ఓట్ల లెక్కింపును నిర్వహించనుంది.
ముగ్గురి మధ్యే ప్రధాన పోరు
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఈ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్యే సాగింది. బీఆర్‌ఎస్ తరఫున గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, భాజపా తరఫున లంకల దీపక్‌రెడ్డి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ఈ ముగ్గురు అభ్యర్థుల ప్రాతినిధ్యం వల్ల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
పోలింగ్ శాతం పెరుగుతుందా?
ప్రాథమిక లెక్కల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం గత ఎన్నికల మాదిరిగానే తక్కువగా నమోదైంది. 2023 ఎన్నికల్లో 47.58 శాతం మాత్రమే నమోదవగా, ఈసారి అది 47.16 శాతంగా ఉంది. అయితే చివరి గంటల్లో ఓటర్లు వేగంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఈ శాతం 50కు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ నమోదవడం సాధారణమే అయినా, ఈసారి ఓటర్ల ఉత్సాహం కొంత పెరిగినట్టు కనిపిస్తోంది.
ఫలితంపై రాజకీయ అంచనాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై తెలంగాణ రాజకీయ వాతావరణం ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఓటింగ్ సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉందన్న అంశంపై విశ్లేషకులు ఇప్పుడు దృష్టి సారించారు. తక్కువ పోలింగ్ అధికార వ్యతిరేకతకు సంకేతమని కొందరు విశ్లేషిస్తే, సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న పార్టీలకు ఇది మేలు చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఫలితాలు వెలువడే వరకు రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే.?
జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నాయంటే..
* ఆత్మసాక్షి అంచనా ప్రకారం కాంగ్రెస్‌కి 46.5 శాతం, బీఆర్ఎస్‌కి 44.5 శాతం, బీజేపీకి 6.5 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* పీపుల్స్ పల్స్- కాంగ్రెస్ 48శాతం, బీఆర్ఎస్ 41శాతం, బీజేపీ 6 శాతం.
* చాణక్య స్ట్రాటజీస్ - కాంగ్రెస్ 46 శాతం, బీఆర్ఎస్ 43 శాతం, బీజేపీ 6 శాతం.
ఇప్పటి వరకు వచ్చిన సర్వేల ఆధారంగా దాదాపు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత వరకు నిజమవుతాయో తెలియాలంటే నవంబర్ 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.