Farmer Scheme : ఒక్కో రైతుకు ఫ్రీగా రూ.6 లక్షలు.. నెలనెలా రూ.5 వేల ఇన్కమ్ కూడా
Indira Solar Giri Jala Vikasam : తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలుచేస్తున్న పథకం ఇందిరా సోలార్ గిరి జల వికాసం. దీని కింద రైతులు ఫ్రీగా రూ.6 లక్షల లాభం పొందవచ్చు… అలాగే నెలనెలా రూ.5 వేల ఆదాయం కూడా పొందవచ్చు.

రైతుల కోసం సరికొత్త పథకం...
Indira Soura Giri Jala Vikasam : తెలంగాణ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. అటవీ ప్రాంతాల్లో నివాసముండే గిరిజన రైతులు చిన్నచిన్న కమతాల్లో వ్యవసాయం చేస్తూ చాలిచాలని ఆదాయాన్ని పొందుతుంటారు. ఇలాంటివారికి వ్యవసాయ ఖర్చులు తగ్గించి సమృద్ధిగా సాగునీరు అందించే ఏర్పాటు చేస్తోంది రేవంత్ సర్కార్. అంతేకాదు నెలనెలా కొంత ఆదాయాన్ని కూడా పొంది ఆర్థికంగా కూడా నిలదొక్కుకునేలా ఓ పథకాన్ని అమలుచేస్తోంది. ఇదే 'ఇందిరా సౌర గిరి జల వికాస్' పథకం.
ఏమిటీ ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకం..?
గతేడాదే తెలంగాణ ప్రభుత్వం ఈ 'ఇందిరా సౌర గిరి జల వికాస్' పథకాన్ని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి 'నల్లమల డిక్లరేషన్' విడుదలచేశారు.
ఈ పథకం కింద గిరిజన రైతులకు రూ.6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ఫ్యానెల్స్ అందిస్తారు. అయితే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది... అంటే 100 శాతం సబ్సిడి ఇస్తుందన్నమాట. దీంతో రూపాయి విద్యుత్ ఖర్చు లేకుండానే రైతులకు సాగునీరు అందుతుంది. ఇలా ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు పెట్టుబడి తగ్గనుంది.
రైతులకు నెలనెలా రూ.5 వేల ఆదాయం..
రాష్ట్ర స్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకం పెట్టుబడి ఖర్చులు తగ్గించడమే కాదు రైతులకు నెలనెలా కొంత ఆదాయం అందిస్తుంది. వ్యవసాయ అవసరాల కంటే ఎక్కువ విద్యుత్ ను ఈ సోలార్ సిస్టమ్ అందిస్తుంది... ఇందులో రైతు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ ను అమ్ముకోవచ్చు. విద్యుత్ గ్రిడ్ కు విక్రయించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.
ఇలా ప్రభుత్వం నుండి ఉచితంగా సోలార్ పంపు సెట్లు, ప్యానెల్స్ పొందిన గిరిజన రైతులు నెలకు 3000 నుండి 5000 రూపాయల వరకు పొందవచ్చు. సోలార్ విద్యుత్ అమ్మకంద్వారా వచ్చే ఈ అదనపు ఆదాయాన్ని రైతులు కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెలా ఆదాయం వస్తుంది కాబట్టి గిరిజన రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇలా ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకం గిరిజన రైతులకు వ్యవసాయంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో భరోసా కల్పిస్తోంది.
ఎవరు అర్హులు..?
తెలంగాణ ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకాన్ని అటవీ ప్రాంతాలు, విద్యుత్ సౌకర్యం సరిగ్గాలేని ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతుల కోసం అమలుచేస్తోంది. ముఖ్యంగా అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా రైతులు అటవీ హక్కు పత్రాలు కలిగివున్నారు... వీరివద్ద 6 లక్షల ఎకరాలు ఉంది. ఈ రైతులందరికి విడతల వారిగా ఈ సౌర గిరి జల వికాస్ పథకాన్ని అందించనున్నారు.
మొదట విడతలో పదివేల మంది రైతులకు ఈ పథకం కింద సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లు అందించనున్నారు. ఇందుకోసం నాబార్డ్ నుండి రూ.600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ప్రభుత్వం కూడా కొన్ని నిధులు జతచేసి ఈ పథకాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్దమవుతోంది.
దరఖాస్తులు ఎప్పట్నుంచి ప్రారంభం..?
నిధుల సమీకరణ తర్వాత ఈ ఇందిర సౌర గిరి జల వికాసం పథకం స్పీడ్ పెంచనున్నారు అధికారులు. ఫిబ్రవరిలో ఈ ప్రక్రియను పూర్తిచేసి మార్చి నుండి అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల నుండి గిరిజన రైతులు దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

