IMD Cold Wave Alert : ఇక 0-10°C టెంపరేచర్ ... ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Weather Update : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అసలైన శీతాకాలం మొదలవుతోంది. రాబోయే పదిరోజుల్లో గడ్డకట్టే స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి పులి
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రుళ్లు, తెల్లవారుజామున పొగమంచుతో కూడిన చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోయి చలితీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే చలిగాలులలో తెలుగు ప్రజలు గజగజా వణికిపోతుంటే రాబోయే పదిరోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ (10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ) కు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముందని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో రెడ్ అలర్ట్
తెలంగాణలో రాబోయే రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయికి చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. చలితీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ మెటలర్జికల్ సెంటర్.
1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :09-11-2025 pic.twitter.com/oisp1BSF6p
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) November 9, 2025
తెలంగాణలో అత్యల్ఫ ఉష్ణోగ్రతలు ఇక్కడే
వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రాబోయే పదిరోజులు అత్యంత చలి వాతావరణం ఉంటుందని ప్రకటించారు. నవంబర్ 11 నుండి 19 వరకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయని హెచ్చరించారు. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్,నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఈ జిల్లాల ప్రజలు మరీముఖ్యంగా శ్వాస సమస్యలతో బాధపడేవారు, చిన్నారులు, ముసలివారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు
మరికొన్ని తెలంగాణ జిల్లాల్లో రాబోయే పదిరోజులు 11 నుండి 14 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్ తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
ఈ తెలంగాణలో జిల్లాల్లోనూ చలి
సౌత్, ఈస్ట్ తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలే రాబోయే పదిరోజులు కూడా ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాబోయే పదిరోజులు 14 నుండి 17 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఈ శీతాకాలంలో అత్యంత చలిగాలులు వీస్తాయని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
COLD WAVE ALERT FOR TELANGANA ⚠️🥶
GET READY for strong November winters, a 8-10day STRONG COLD WEATHER especially during Nov 11-19 (Peak during Nov 13-17) with SINGLE DIGIT TEMPERATURES expected in PINK marked districts
BLUE marked districts including Hyderabad City will… pic.twitter.com/H7Mg4Ws2tT— Telangana Weatherman (@balaji25_t) November 9, 2025
అత్యల్ఫ ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లోనే
ఆదివారం (నవంబర్ 9న) తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ శివారు పటాన్ చెరు ఈక్రిశాట్ వద్ద 13.2 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. ఇక హయత్ నగర్ 15.6, బేగంపేటలో 16.9, రాజేంద్ర నగర్ లో 18, హకీంపేటలో 18.2, దుండిగల్ 17.8 డిగ్రీ సెల్సియస్ గా ఉంది.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్ లో)
మెదక్ 14.1
ఆదిలాబాద్ లో 14.2
నిజామాబాద్16.8
భద్రాచలం 20
హన్మకొండ 16
ఖమ్మం 19.6
మహబూబ్ నగర్ 18.0
నల్గొండ 20
రామగుండం 17.8
ఏపీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎముకలు కొరికే చలి ఉంది. మినుమలూరులో అత్యల్పంగా 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక పాడేరులో 12 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది... మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి వాతావరణంమే ఉంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని ఏపీ వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి.