- Home
- Telangana
- IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాలపై లానినా ఎఫెక్ట్ ... ఈ ప్రాంతాల్లో అసాధారణ చలిగాలులు, బిఅలెర్ట్
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాలపై లానినా ఎఫెక్ట్ ... ఈ ప్రాంతాల్లో అసాధారణ చలిగాలులు, బిఅలెర్ట్
Telugu States Weather Update : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి చలితీవ్రత పెరుగుతోంది. ఇందుకు లానినా ప్రభావమే కారణంగా తెలుస్తోంది. ఈ లానినా అంటే ఏమిటి?

తెలుగు రాష్ట్రాలు గజగజా..
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రుళ్లు, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కొన్నిచోట్ల మరింత దారుణంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లానినా ప్రభావంతో ఈసారి భారతదేశంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
లానినా అంటే ఏమిటి?
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ మార్పుల్లో ఒకటే ఈ లానినా. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా చల్లగా మారతాయి. దీంతో భూమిపైన వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. రెండుమూడేళ్లకు ఒకసారి లానినా ఏర్పడుతుందని... ఈ ఏడాది ఇది ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లానినా ప్రభావంతోనే భారతదేశంలోని ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతున్నాయని... రాబోయే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి.
తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు :
తెలంగాణలో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణం కన్నా రెండుమూడు డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత పెరుగుతూ వస్తుందని... పదిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ లో 8.7 డిగ్రీ సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మిగతా జిల్లాల్లోనూ 10 డిగ్రీ సెల్సియస్ కు అటుఇటుగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాత్రుళ్లు కంటే తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది... ఉదయం ఏడెనిమిది గంటల వరకు ఈ చలి కొనసాగుతోంది. పొగమంచు కారణంగా ఉదయం ప్రయాణాలు చేసేవారు, వాకింగ్, జాగింగ్ కు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారుప్రాంతాల్లో మరీముఖ్యంగా పటాన్ చెరు పరిసరాల్లో పొగమంచు ఎక్కువగా ఉంటోంది.
ఆంధ్ర ప్రదేశ్ ను వణికిస్తున్న చలిపులి
ఉత్తరాదినుండి వీస్తున్న చల్లని గాలులతో ఆంధ్ర ప్రదేశ్ లో చలితీవ్రత పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ చలితీవ్రత పెరుగుతోంది... మరికొద్ది రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి.
చలికాలం పాటించాల్సిన జాగ్రత్తలు
1. రాత్రులు, ఉదయం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దు.
2. ముసలివారు, చిన్నారులు చలిగాలులతో ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయి. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.
3. శ్వాస సంబధిత సమస్యలతో బాధపడేవారు కూడా చలికాలం జాగ్రత్తగా ఉండాలి.
4. స్వెట్టర్లు, మంకీ క్యాప్, సాక్స్ వంటివి ధరించి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి.
5. ఇంటిని కూడా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లరాదు.
6. శరీరాన్ని వెచ్చగా ఉంచే అహార పదార్థాలను తీసుకోవాలి.