- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు... మళ్లీ అల్లకల్లోలం తప్పదా..?
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు... మళ్లీ అల్లకల్లోలం తప్పదా..?
IMD Rain Alert : వర్షాకాలం ముగిసింది… శీతాకాలం కొనసాగుతోంది… అయినా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షభయం
IMD Rain Alert : ఇటీవల మొంథా తుపాను సృష్టించిన బీభత్సాన్ని తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు... కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కేంద్ర బృందం తుపాను తీవ్రతను అంచనా వేయడానికి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తోంది... అంటే మొంథా కల్లోలం ఇంకా కళ్లముందే ఉందన్నమాట. ఇలాంటి సమయంలో మరో తుపాను తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చలిగాలులు కొనసాగుతున్నా వచ్చేవారం వాతావరణం పూర్తిగా మారిపోతుందని అంచనా వేస్తున్నారు.
పొంచివున్న మరో తుపాను ముప్పు
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు బంగాళాఖాతంలో త్వరలోనే అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... ఇది వాయుగుండంగా మారుతుందని... తుపానుగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని వైజాగ్ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నవంబర్ 18 నుండి 25 వరకు అంటే వారంరోజులపాటు వాయుగుండం లేదా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
Breaking ‼️ Cyclone or Depression possibilities looks high during Nov 18 to 25. Andhra Pradesh and Tamil nadu On watch . More updates later next week 👍 pic.twitter.com/YEcb74QJgs
— Vizag weatherman🇮🇳 (@KiranWeatherman) November 8, 2025
ఏపీ వెదర్ మ్యాన్ ఏమంటున్నాడంటే...
ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ కూడా తుపానుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పసిఫిక్ సముద్రంలో తీవ్ర తుపాను కొనసాగుతోందని... ఇది వియత్నాం, థాయిలాండ్ మీదుగా బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో పరిస్థితులు మారిపోతాయని.. తుపాను బలహీనపడినా అల్పపీడన పరిస్థితులు కొనసాగుతాయని తెలిపారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
తెలుగు ప్రజలారా.. ముందుగానే జాగ్రత్తపడండి
అక్టోబర్ చివర్లో మొంథా తుపాను బీభత్సం మాదిరిగానే నవంబర్ చివర్లో మరో తుపాను బీభత్సం తప్పదేమోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు. ప్రస్తుతం ఖరీప్ కోతలు, ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు కురిస్తే చేతికందివచ్చిన పంటలు దెబ్బతినే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు ముందుగానే జాగ్రత్తపడితే మంచిది. వర్షాల సమయంలో ఎలాంటి వ్యవసాయ పనులు పెట్టుకోవద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
పంజా విసురుతున్న చలిపులి
ఇదిలావుంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు తీవ్రత తారాస్థాయికి చేరింది. అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలోకి పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 డిగ్రీ సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే చలి తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా అత్యల్పంగా 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.