- Home
- Telangana
- IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో అల్లకల్లోలమే? తెలంగాణలోని ఈ 4 జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ తప్పదా?
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో అల్లకల్లోలమే? తెలంగాణలోని ఈ 4 జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ తప్పదా?
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కుండపోత వర్షాలు తప్పవా? అంటే వాతావరణ శాఖ నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. నేడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ జోరువానలు
IMD Rain Alert : వర్షాలు కురిస్తే సంబరపడే రోజులుపోయి భయపడే పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనంచేయడం, కాలుష్యం పెరిగిపోవడం... వాతావరణ మార్పులకు ఇలాంటి కారణాలు అనేకం. అందుకే ఒకేచోట అసాధారణ వర్షాలు కురుస్తుండటంతో క్లౌడ్ బరస్ట్ అనే పదం బాగా వినిపిస్తోంది. ఎక్కడో హిమాలయా పర్వతాలను కలిగిన ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనూ క్లౌడ్ బరస్ట్ స్థాయి వర్షాలు పడుతున్నాయి... ఇటీవల కామారెడ్డి, మెదక్ లో కురిసిన వర్షమే ఇందుకు ఉదాహరణ. తాజాగా తెలంగాణలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలుగు ప్రజలు కంగారుపడుతున్నారు.
తెలుగు ప్రజలారా... బిఅలర్ట్
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆవర్తనం కాస్త బలపడి అల్పపీడనం మారినట్లు వాతావరణ శాఖ చెబుతోంది... దీంతో భారీ వర్షాల కాస్త అతిభారీ, కుండపోత వర్షాలుగా మారనున్నాయని హెచ్చరిస్తోంది. ఇవాళ్టి(శనివారం) నుండి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు... మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలతో పాటు వరదల కారణంగా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఈ 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ (సెప్టెంబర్ 13, శనివారం) నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి,సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వికారాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల,సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
నేడు ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలున్నాయని ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తీరప్రాంత ప్రజలు జాగ్రత్త
ఆంధ్ర ప్రదేశ్ లో తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వరద పరిస్థితులు లేదంటే మరేదైనా ప్రమాదం పొంచివుంటే ముందుగానే జాగ్రత్తపడాలని సూచిస్తోంది ఏపీ విపత్తు నిర్వహణ విభాగం.