- Home
- Telangana
- IMD Rain Alert : ఆవర్తనం పని అయిపోగానే అల్పపీడనం స్టార్ట్ .. తెలుగు రాష్ట్రాల్లో అప్పటివరకు కుండపోతే
IMD Rain Alert : ఆవర్తనం పని అయిపోగానే అల్పపీడనం స్టార్ట్ .. తెలుగు రాష్ట్రాల్లో అప్పటివరకు కుండపోతే
IMD Rain Alert : ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది… ఇది బలపడి అల్పపీడనంగా మారుతోందట. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. తాజా వాతావరణ పరిస్థితులు చూస్తుంటే కుండపోత వానలు తప్పవని అర్థమవుతోంది... వాతావరణ శాఖ కూడా ఇదే చెబుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది మరింత బలపడుతూ రేపటికి (సెప్టెంబర్ 13) అల్పపీడనంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే ఇప్పటికే వర్షాలు జోరందుకోగా ఇవి మరింత విజృంభించే అవకాశాలున్నాయని... కొన్నిజిల్లాలకు వరద ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తోంది.
తెలంగాణలో మరో నాల్రోజులు వర్షాలు
తెలంగాణలో మరో నాలుగురోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 12, శుక్రవారం) ముఖ్యంగా నిర్మల్ , జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ, సిరిసిల్ల, సూర్యాపేట, కామారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి గద్వాల జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇవి కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలు
ఇక హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి... ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వానలు పడుతున్నాయి. ఇవాళ కూడా నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శివారులోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవుతాయని... గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గురువారం భారీ వర్షం
నిన్న(గురువారం) హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరుతో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో కూడా దంచికొట్టింది. మద్యాహ్నం మొదలైన వర్షం సాయంత్రం వరకు కొనసాగింది.
మెదక్ పట్టణంలో నిన్న ఏకంగా 17.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది... భారీ వర్షంతో పట్టణంలోని రోడ్లు, కాలనీలన్ని జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వదరనీరు చేరాయి. మున్సిపల్ అధికారులు వెంటనే సిబ్బందిని అలర్ట్ చేసి సహాయక చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలపై సీఎం సమీక్ష
మళ్లీ తెలంగాణలో భారీ వర్షాలు మొదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయన్న IMD హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లలో ఉన్నవారిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బంది అలర్ట్
హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్,పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం సూచించారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.