IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Weather Updates in Telangana : తెలంగాణలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని… ఓ నాలుగు జిల్లాలపై అయితే చలి పంజా విసురుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ జిల్లాలేవో తెలుసా?

ఇదేం చలిరా నాయనా..!
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ ఆరంభంనుండే చలి తీవ్రత పెరిగింది... ఈ నెల చివరకు చేరుకుంటున్నకొద్దీ మరింత పెరుగుతోంది. కొన్నిచోట్ల అత్యల్పంగా 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... దీన్నిబట్టే చలి ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
చలికి పొగమంచు తోడవుతోంది... అర్ధరాత్రులు, తెల్లవారుజామున కురుస్తున్న దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నెల (జనవరి 2026) పూర్తయ్యేవరకు ఇదే స్థాయిలో చలి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జనవరి చివర్లో వర్షాలు కురిసే అవకాశాలుంటాయని... దీంతో ఈ చలి తీవ్రత క్రమక్రమంగా తగ్గే అవకాశాలుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నారు.
చలికి గజగజా
ప్రస్తుతం తెలంగాణలో వాతావరణ పరిస్థితి దారుణంగా ఉంది. అటవులు, కొండప్రాంతాల్లో చెట్లుచేమల ఉంటాయి కాబట్టి చలి ఎక్కువగా ఉండటం సర్వసాధారణం. కానీ కాంక్రీట్ జంగిల్, వాహనాల పొల్యూషన్ తో నిండివుండే హైదరాబాద్ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆశ్చర్యకరం. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు హైదరాబాద్ శివారుల్లో నమోదవుతున్నాయి... ఇలా ఈ శీతాకాలం నగరవాసులను గజగజా వణికిస్తోంది.
హైదరాబాద్ లో లోయెస్ట్ టెంపరేచర్స్
కొద్ది రోజులుగా హైదరాబాద్ లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. GHMC పరిధిలోని పటాన్ చెరు (ఈక్రిశాట్) లో 8.4, రాజేంద్ర నగర్ లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హయత్ నగర్ లో 11.6, బేగంపేటలో 12.7 డిగ్రీలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లోనూ చలి చంపేస్తోంది.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే
ఇక తెలంగాణలోనే అత్యల్పంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 7 డిగ్రీల టెంపరేచర్స్ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 7.6, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 8.0, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 8.1, కామారెడ్డి జిల్లా గాంధారిలో 8.9, వికారాబాద్ జిల్లా నవాబ్ పేటలో 9, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 9.8, సిద్దిపేట జిల్లా మార్కుఖ్ లో 9.8, నిర్మల్ జిల్లా పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 10 నుండి 20 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. జిల్లాల సగటు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఆదిలాబాద్ లో 7.8, మెదక్ లో 8.3, హన్మకొండలో 10.5, నిజామాబాద్ లో 12.6, రామగుండంలో 12.8 డిగ్రీలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
రాబోయే రోజుల్లో మరింత చలి
రాబోయే రోజుల్లోనూ తెలంగాణలో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వారంమొత్తం అంటే డిసెంబర్ 27 వరకు ఇదే స్థాయిలో చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ నాల్రోజులు 5-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... మిగతా జిల్లాల్లో 11 నుండి 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది.

