- Home
- Telangana
- Hyderabad: డీఫెన్స్ రంగంలో హైదరాబాద్ స్టార్టప్‌ల సంచలనం.. భారత తొలి స్టెల్త్ డ్రోన్లు ఇక్కడి నుంచే.. !
Hyderabad: డీఫెన్స్ రంగంలో హైదరాబాద్ స్టార్టప్‌ల సంచలనం.. భారత తొలి స్టెల్త్ డ్రోన్లు ఇక్కడి నుంచే.. !
Hyderabad: హైదరాబాద్‌కి చెందిన వీరా డైనమిక్స్, బిన్‌ఫోర్డ్ ల్యాబ్స్ కలిసి దేశీయంగా తొలి స్టెల్త్ డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. సాయుధ దళాల కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్టెల్త్ డ్రోన్‌లను ఈ స్టార్టప్‌లు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.

హైదరాబాద్ టెక్నాలజీ శక్తితో సత్తా చాటుతున్న స్టార్టప్‌లు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ స్టార్టప్‌ల అడ్డాగా సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు స్టార్టప్‌లతో అంతర్జాతీయంగా హైదరాబాద్ తన ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ.. మరో స్టార్టప్ కంపెనీ సాయుధ దళాల కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్టెల్త్ డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌లు వీరా డైనమిక్స్, బిన్‌ఫోర్డ్ రీసర్చ్ ల్యాబ్స్ కలిసి భారత తొలి స్వదేశీ స్టెల్త్ డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో భారత రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ఒక వినూత్న ప్రయాణం మొదలైంది.
రామ (RAMA) టెక్నాలజీతో స్టెల్త్ సామర్థ్యం
ఈ డ్రోన్లు RAMA (Radar Absorption & Multispectral Adaptive) అనే అధునాతన స్టెల్త్ టెక్నాలజీతో వుంటాయి. ఇది రాడార్, థర్మల్ గుర్తింపులను గణనీయంగా తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. నానో టెక్నాలజీ, కార్బన్ కాంపోజిట్ మిశ్రమాల ఆధారంగా అభివృద్ధి చేసిన RAMA పదార్థం, డ్రోన్లను వాస్తవికంగా కనిపించకుండా చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
మిషన్లలో శత్రు రాడార్లను, ఇతర టెక్నాలజీ నుంచి తప్పించుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సాంకేతికతతో కూడిన డ్రోన్లు గూఢచర్య, రిస్క్ మిషన్ లకు ఉపయోగపడతాయి. పరీక్షల్లో RAMA పదార్థం ఇన్‌ఫ్రారెడ్ సిగ్నల్స్‌ను 97% వరకు, రాడార్ సిగ్నల్స్‌ను 90% వరకు తగ్గించగలగడం నిరూపితమైంది.
బిన్‌ఫోర్డ్ డ్రోన్ల ప్రత్యేకతలు
బిన్‌ఫోర్డ్ ల్యాబ్స్ అభివృద్ధి చేస్తున్న డ్రోన్లు ఆటోనమస్ గా పనిచేస్తాయి. ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ (RF), జీపీఎస్ (GPS) లభించని పరిసరాల్లో సైతం అత్యంత ప్రభావవంతంగా పనిచేయగలవు. ఈ డ్రోన్లు హై-రిస్క్, గూఢచర్య మిషన్‌ల కోసం ఉపయోగిస్తారు. వాటి పనితీరులో డేటా కమ్యూనికేషన్ అంతరాయం కలిగిన పరిస్థితులలో కూడా వినూత్నంగా స్పందించి పనిని పూర్తి చేస్తాయి.
ఆపరేషన్ సింధూర్ తర్వాత విజయవంతమైన ట్రయల్స్
ఈ డ్రోన్లపై ఆపరేషన్ సింధూర్ అనంతరం ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ప్రయోగాలు విజయవంతమవడంతో భారత రక్షణ సంస్థల దృష్టిని ఆకర్షించాయి. రాబోయే రోజుల్లో వీటి వినియోగంపై మరింత ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని iDEX (Innovations for Defence Excellence) ప్రోగ్రామ్ ద్వారా మద్దతు లభిస్తోంది. అలాగే, ఐఐటీ హైదరాబాద్ (Indian Institute of Technology, Hyderabad) ఇన్క్యుబేషన్ సదుపాయాల ద్వారా ఈ స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారం లభించింది. ఇది దేశీ డీఫెన్స్ ఇన్నోవేషన్‌కు హైదరాబాద్ అందిస్తున్న గొప్ప భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
హైదరాబాద్ నుంచి దేశ రక్షణ కోసం కొత్త టెక్నాలజీ
వీరా డైనమిక్స్, బిన్‌ఫోర్డ్ ల్యాబ్స్ తీసుకుంటున్న ఈ పాథ్-బ్రేకింగ్ చర్య మేడ్ ఇన్ హైదరాబాద్ - మేడ్ ఫర్ ది నేషన్ (Made in Hyderabad, Made for the Nation) అనే భావనకు నిజమైన అర్థాన్ని ఇస్తోంది. తెలంగాణలోని ప్రగతిశీల డీప్-టెక్ ఎకోసిస్టమ్‌కు ఇది ఒక ప్రధానమైన చర్యగా నిలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా, హైదరాబాద్ నగరం దేశీ డీఫెన్స్ ఇన్నోవేషన్‌లో కీలకంగా నిలుస్తోంది. స్టెల్త్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఆటోనమస్ UAV వ్యవస్థల కలయిక భారత రక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఉంది.