- Home
- Telangana
- Weather : హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత, వణికిస్తున్న చలి.. ఏ ప్రాంతంలో, ఎంత నమోదయ్యిందో తెలుసా?
Weather : హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత, వణికిస్తున్న చలి.. ఏ ప్రాంతంలో, ఎంత నమోదయ్యిందో తెలుసా?
Cold Weather : వర్షకాలం ముగుస్తుండటంతో మెల్లిగా చలి పంజా విసురుతోంది. ఆరంభంలోనే ఉష్ణోగ్రతల పడిపోతూ చలితీవ్రత పెరుగుతోంది… తెలంగాణలో అత్యల్ఫ ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లో నమోదయ్యాయి.. ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం షురూ...
Cold Weather : ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశం నుండి నిష్క్రమిస్తున్నాయి... అంటే టెక్నికల్ గా వర్షాకాలం ముగిసినట్లే. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తుండటంతో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి... ఇదే సమయంలో చలి ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మెల్లిగా పడిపోతున్నాయి... ఆసక్తికర విషయం ఏమిటంటే పల్లెప్రాంతాల్లో కాకుండా పట్టణాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదై చలి ఎక్కువగా ఉంటోంది.
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లోనే..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శుక్రవారం (అక్టోబర్ 10) రాష్ట్రంలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పటాన్ చెరు పరిధిలోని బిహెచ్ఈఎల్, ఈక్రిశాట్ ప్రాంతాల్లో 19.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయయ్యింది. ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ లో 19.3 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20-25 డిగ్రీ సెల్సియస్ లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికం మాత్రం ఆదిలాబాద్ లో 33.8 డిగ్రీ సెల్సియస్.
ఆంధ్ర ప్రదేశ్ ను వణికిస్తున్న చలి
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వణికించడం ప్రారంభించింది. దీంతో ప్రజలు ఇప్పటివరకు వర్షాల వల్ల అప్రమత్తంగా ఉంటే ఇప్పుడు చలి నుండి అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. చలికాలంలో శ్వాస, చర్మ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండాలని వాతావరణ, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జిల్లాల్లో నేడు వర్షాలు
ఇక వర్షాల విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆంధ్ర ప్రదేశ్ లో మెల్లిగా విస్తరిస్తోంది... ఇప్పటికే ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఇది విస్తరించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం(అక్టోబర్ 11న) అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ వర్షాలకు పిడుగులు, ఈదురుగాలులు తోడయి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని ప్రఖర్ జైన్ సూచించారు.
ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే...
శుక్రవారం (అక్టోబర్ 10న) ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగాయి. సాయంత్రం 5 గంటలకు అత్యధికంగా కోనసీమ జిల్లా నగరంలో 46 మిమీ, మలికిపురంలో 36.2మిమీ, ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27మిమీ, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 25.5మిమీ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో మరికొన్నిచోట్ల కూడా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయని APSDMA తెలిపింది.
తెలంగాణను వీడని వానలు
తెలంగాణ వర్షాల విషయానికి వస్తే ద్రోణి, ఉపరతల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ(అక్టోబర్ 11) వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లోనే కాదు మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.