- Home
- Telangana
- 36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వరులయ్యేవారు
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వరులయ్యేవారు
Hyderabad: హైదరాబాద్‌లో భూమి కొనాలంటే భయపడే పరిస్థితి. అయితే ఒకప్పుడు మాత్రం భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవి. చదరపు గజం భూమి రూపాయి లోపే లభించిన ప్రాంతాలు కూడా ఉండేవని చెబుతారు. కానీ కాలక్రమేణ భూములు ధరలకు రెక్కలొచ్చాయి.

1947–1960లు.. హైదరాబాద్‌లో భూముల ధరలు ఎలా ఉండేవి.?
స్వాతంత్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ నగరం ఇప్పటిలా విస్తరించి ఉండేది కాదు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిన తర్వాత నగరం క్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఆ సమయంలో నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం భూమి ధర సుమారు రూ.0.25 నుంచి రూ.2 వరకు ఉండేదని అంచనాలు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే నేడు భూముల ధరలు ఊహించని స్థాయికి చేరాయి.
అప్పట్లో అబిడ్స్, సుల్తాన్ బజార్ వంటి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా చదరపు గజం ధర సుమారు రూ.5 నుంచి రూ.10 వరకు ఉండేదని చెబుతారు. బసీర్‌బాగ్ వంటి ప్రాంతాల్లో కూడా నేటి స్థాయిలో భారీ ధరలు ఉండేవి కావు. హైదరాబాద్ నగరం విస్తీర్ణం తక్కువగా ఉండటం, జనాభా తక్కువగా ఉండటం, రియల్ ఎస్టేట్‌పై పెద్దగా పెట్టుబడులు పెట్టకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు.
1970–1980లు.. పరిశ్రమలు, కొత్త ప్రాంతాలతో వేగం
1970లలో హైదరాబాద్ నగరం నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించింది. హిమాయత్‌నగర్, నారాయణగూడ వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో అక్కడ భూములకు డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో చదరపు గజం భూమి ధర సుమారు రూ.10 నుంచి రూ.50 వరకు ఉండేదని అంచనా.
1980లలో పరిస్థితి మరింత మారింది. కూకట్‌పల్లి, ఉప్పల్ వంటి ప్రాంతాలు క్రమంగా అభివృద్ధి చెందాయి. హెచ్‌ఎంటీ, ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్ వంటి పరిశ్రమలు, వాటి చుట్టూ ఏర్పడిన టౌన్‌షిప్‌లు సమీప ప్రాంతాల్లో భూముల విలువ పెరగడానికి కారణమయ్యాయి. ఈ దశలో నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.50 నుంచి రూ.200 వరకు చేరినట్లు అంచనాలు ఉన్నాయి.
1990లు.. ఐటీ రంగం రాకతో రియల్ ఎస్టేట్‌లో కీలక మలుపు
1990లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద మార్పు మొదలైంది. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాలు భవిష్యత్తులో ఐటీ హబ్‌గా మారనున్నాయనే అంచనాలు పెరిగాయి. ఆ సమయంలో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి. 1990ల ప్రారంభంలో మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో చదరపు గజం ధర సుమారు రూ.100 నుంచి రూ.300 మధ్య ఉండేదని అంచనా. ఇప్పుడు ఈ ధరలు ఏకంగా రూ. లక్ష వరకు చేరింది.
అదే సమయంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ధరలు మరింత ఎక్కువగా ఉండేవి. అక్కడ చదరపు గజం ధర సుమారు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఉన్నట్లు చెబుతారు. హైటెక్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు, ఐటీ కంపెనీల రాకతో పశ్చిమ హైదరాబాద్‌పై రియల్ ఎస్టేట్ దృష్టి మరింత పెరిగింది. దీంతో భూముల ధరల్లో వేగంగా మార్పు మొదలైంది.
2000–2010లు.. సైబరాబాద్‌తో మారిపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్
2000లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పుంజుకుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, కార్యాలయాలు పెరగడంతో ఉద్యోగాల కోసం నగరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం ప్రారంభమైంది. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో చదరపు గజం భూమి ధర సుమారు రూ.2,000 నుంచి రూ.8,000 వరకు పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి. బంజారాహిల్స్‌లో ధరలు రూ.15,000 నుంచి రూ.40,000 వరకు చేరాయి. మరోవైపు అపార్ట్‌మెంట్ల ధరలు కూడా ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగుకు సుమారు రూ.1,000 నుంచి రూ.2,500 వరకు ఉండేవి.
2010లలో ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలు నగర విస్తరణకు మరింత ఊతమిచ్చాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నర్సింగి, మియాపూర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగాయి. ORR చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు కూడా వేగంగా పెరగడం ప్రారంభమైంది.
1947 నుంచి 2025 వరకు.. ఒక్కసారి చూస్తే
1947–1960లలో చదరపు గజం భూమి ధర సుమారు రూ.1–రూ.10 స్థాయిలో ఉండగా, 1980లలో రూ.50–రూ.200 వరకు పెరిగింది. 1990లలో కొన్ని ప్రాంతాల్లో రూ.200–రూ.2,000కి చేరింది. 2000లలో రూ.2,000–రూ.8,000 వరకు పెరిగింది. 2010లలో నర్సింగి, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో ధరలు రూ.8,000 నుంచి రూ.50,000 వరకు వెళ్లాయి. 2025 నాటికి హైదరాబాద్‌లోని ప్రాంతాన్ని బట్టి చదరపు గజం భూమి ధర రూ.20,000 నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువకు చేరింది.
అంటే ఒకప్పుడు రూపాయల్లో ఉన్న హైదరాబాద్ భూముల ధరలు.. దశాబ్దాలు గడిచే కొద్దీ వేలల్లోకి, లక్షల్లోకి చేరాయి. నగర విస్తరణ, ఐటీ రంగం, ఉద్యోగ అవకాశాలు, రహదారులు, మెట్రో, ORR, విమానాశ్రయం, భవిష్యత్తు మౌలిక సదుపాయాల అంచనాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విలువను భారీగా పెంచిన ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు రియల్ ఎస్టేట్ నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించడమైంది. అప్పట్లో నిజంగా ఇవే ధరలు ఉండేవా అన్న విషయాన్ని 100 శాతం కచ్చితత్వంతో నిర్ధారించలేము.

