హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన బైక్‌లు.. (ఫొటోలు)
హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు మార్గాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్లు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.

ఈరోజు ఉదయం హిమాయత్‌నగర్‌లో అత్యధికంగా 77.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శెరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్, షేక్‌పేట్, నాంపల్లిలో కూడా భారీ వర్షం కురిసింది. లక్డీకాపూల్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మోకాల్లోతు నీరు నిలిచింది.
పంజాగుట్ట, ఎల్బీనగర్, అమీర్ పేట్, కోఠి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, హయత్ నగర్, బేగంపేట్, అడ్డగుట్ట, వారాసిగూడ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురిసింది. హైదరాబాద్‌లో రానున్న మూడు గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారీ వర్షం సృష్టించిన బీభత్సంతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో మోకాల్లోతు నీళ్లు నిలిచాయి. నల్లకుంట పద్మ కాలనీలో ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రామ్ నగర్‌లో దాదాపుగా కార్ల మీద నుంచి వర్షపు నీరు ప్రవహించింది. అలాగే పలు కాలనీల్లో రోడ్లపై వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్త పేరుకుపోయింది.
హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఇక, సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది పాప ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా పార్క్ లైన్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. దీంతో చిన్నారి మౌనిక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.