Telangana Rains : ఈ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?
తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆయా జిల్లాలకు క్లౌడ్ బరస్ట్ భయం పట్టుకుంది… అంటే కుంభవృష్టి ఉంటుందేమోనని భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం
Telugu States Weather Updates : తెలంగాణలో నేడు (మంగళవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా వర్షాలేమీ ఉండవని... అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశం ఉందని ప్రకటించింది . ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వాతావరణం ఎలా ఉంటుంది? వర్షాలు కురిసే జిల్లాలేవి? వాతావరణ శాఖ సూచనలేమిటి? తెలుసుకుందాం.
నేడు తెలంగాణలో భారీ వర్షాలు
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి... దీనికి తోడు మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ మీదుగా ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో వర్షాలు మరింత జోరందుకుంటాయని... ఇవాళ(మంగళవారం) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ ప్రకటించింది.
ఈ తెలంగాణ జిల్లాల్లో కుంభవృష్టి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక్కడ ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలుంటాయట. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
నేడు తెలంగాణలో ఆహ్లాదకర వాతావరణం
ఇక రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం చల్లగా ఉంటుందని... అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయట... అలాగే ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో నేడు(మంగళవారం) పెద్దగా వర్షాలుండవని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. అయితే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.