హైదరబాదీలు జాగ్రత్త : నగరంలోకి కొత్త వ్యాధి ఎంట్రీ... ఏమిటది? లక్షణాలేంటి?
తెలంగాణ ప్రజలకు మరో వ్యాధి భయం పట్టుకుంది. ఇప్పటికే కరోనా, హెచ్ఎంపివి భయంనుండి భయపపడ్డ ప్రజలకు ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో ఈ వ్యాధి బైటపడటం కలకలం రేపుతోంది. ఇంతకూ ఏమిటా వ్యాధి? లక్షణాలేంటి? ఎలా సోకుతుంది? సోకకుండా జాగ్రత్తలేంటి? పూర్తి డిటెయిల్స్

Guillain Barre syndrome
Guillain Barre syndrome (GBS) : మొన్న కరోనా, నిన్న హెచ్ఎంపివి, నేడు గులియన్ బారే సిండ్రోమ్... ప్రజారోగ్యంపై ఇలా నిత్యం దాడుల జరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి ఎంతటి భీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే... దాదాపు రెండుమూడేళ్లు ప్రాణాలతో చెలగాటం ఆడింది. దీన్ని ప్రభావం తగ్గి ప్రజలు మరిచిపోతున్న సమయంలో HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్) ఎంటర్ అయ్యింది. ఇది కరోనా మాదిరిగా మారణహోమం సృష్టించలేదు కానీ ప్రజలను బయపెట్టింది. దీన్ని మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు కొత్తగా గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది.
ప్రస్తుతం మన దేశంలో వెలుగుచూస్తున్న ఈ గులియన్ బారే సిండ్రోమ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ జిబిఎస్ కేసులు బైటపడ్డాయి... వందలాది మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ సిండ్రోమ్ బారినపడినవారు తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి మెల్లిగా ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతోంది.
తెలంగాణలో కూడా మొదటి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదయ్యింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళ ఈ జిబిఎస్ బారిన పడినట్లు వైద్యులు నిర్దారించారు. ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Guillain Barre syndrome
దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ మరణాలు :
జిబిఎస్ ప్రాణాంతకమైనదిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దీని బారినపడి మహారాష్ట్రలో ఇద్దరు మృతిచెందారు. షోలాపూర్ కు చెందిన 41 ఏళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ జిబిఎస్ తో బాధపడుతూ మృతిచెందాడు. ఇది మనదేశంలో తొలి జిబిఎస్ మరణం. ఇక ఇటీవల పూణేలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వృద్దురాలు కూడా మృతిచెందింది. ఆమె ఈ జిబిఎస్ బారినపడే అనారోగ్యానికి గురయి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఇలా మహారాష్ట్రలో ఈ జిబిఎస్ మరికొందరి పరిస్థితి కూడా విషమంగా వుంది.
ఈ సిండ్రోమ్ ప్రాణాలు తీస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది... వైద్యారోగ్యశాఖ అధికారులు నియంత్రణా చర్యలు చేపట్టారు. మొత్తంగా మహారాష్ట్రలో 127 జిబిఎస్ కేసులు నమోదయ్యాయి... వీరంతా వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమ బెంగాల్ లో కూడా గులియన్ బారే సిండ్రోమ్ కారణంగా ముగ్గురు మరణించారు... వీరిలో ఓ చిన్నారి కూడా వుంది. రాజధాని కోల్ కతాలో ఈ జిబిఎస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా జిబిఎస్ మరణాలు, కేసుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
Guillain Barre syndrome
గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు :
ఈ జిబిఎస్ బారిన పడ్డవారిలో ముందుగా చేతులు,కాళ్ళలో తిమ్మిర్లను గుర్తించవచ్చు. కాళ్లు, చేతుల్లో నొప్పి కూడా వుంటుంది. కొందరిలో కాళ్లలోని కండరాలు బలహీనపడి నడవలేని స్థితి ఏర్పడుతుంది. శరీరభాగాల్లో జలదరింపు కూడా వుంటుంది.
ఈ సిండ్రోమ్ సోకినవారంలో జ్వరం, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు కూడా జిబిఎస్ లక్షణాలే.
కొన్నిసార్లు గొంతులోని కండరాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. దీంతో అహారం నమలడం, మింగడం, మాట్లాడటం ఇబ్బందిగా వుండవచ్చు. కొందరిలో కంటి కండరాలు కూడా బలహీనపడి నొప్పి, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ జిబిఎస్ శ్వాస వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. శ్వాస కండరాలపైనా ఇది ప్రభావం చూపిస్తుంది... కాబట్టి ఇది సోకినవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈ సిండ్రోమ్ రక్తపోటుపై ప్రభావం చూపి గుండె పనితీరును దెబ్బతీస్తుంది. కొందరిలో ఇది హార్ట్ ఎటాక్ కు దారితీయవచ్చు.
మూత్రాశయంపైనా దీని ప్రభావం వుంటుంది. మూత్రంపై నియంత్రణ కోల్పోవడం కూడా ఈ లక్షణాల్లో ఒకటి.
Guillain Barre syndrome
గులియన్ బారో సిండ్రోమ్ ఎలా సోకుతుంది?
GBS అనేది వైరస్, బ్యాక్టిరియా వంటి సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తుంది. కలుషిత ఆహారం,నీరు తీసుకోవడం వల్ల ఇది సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అపరిశుభ్రమైన పదార్థాలు తినకూడదని, స్వచ్చమైన నీటిని తాగాలని సూచిస్తున్నారు.
అయితే గులియన్ బారో సిండ్రోమ్ అంటువ్యాధి కాదు... కరోనా, HMPV మాదిరిగా ఒకరినుండి ఒకరికి సోకదు.అలాగే దీనికి వైద్యం, మెడిసిన్స్ కూడా వున్నాయి. కాబట్టి కంగారుపడవద్దని వైద్యులు ధైర్యం చెబుతున్నాయి. ఈ జిబిఎస్ బారినపడ్డాక వైద్యం తీసుకోవడం కంటే ఇది సోకకుండా ముందుజాగ్రత్త పడటం మంచిది. కాబట్టి తినే అహారం, నీటి విషయంలో జాగ్రత్తగా వుండండి.
రోగ నిరోదక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ జిబిఎస్ బారిన ఎక్కువగా పడే అవకాశం వుంటుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావంచూపించి పక్షపాతం, హార్ట్ ఎటాక్ కు దారితీసి ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి రోగనిరోదక శక్తిని పెంచుకునే ఆరోగ్య సూత్రాలను పాటించింది. మంచి ఆరోగ్యవంతులపై ఈ గులియన్ బారో సిండ్రోమ్ ప్రభావం పెద్దగా వుండదు.