Housing Schemes : మీకు ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుంది... పీఎం ఆవాస్, ఇందిరమ్మ ఇళ్ళకు అర్హతలివే
సొంతింటి కలను నిజం చేసుకునే అద్భుత అవకాశం మీ ముందుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ స్కీమ్స్ అమలుచేస్తున్నారు... ఇందుకు మీరు అర్హులయితే అప్లై చేసుకొండి. మీరు అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇక్కడ చూడండి.

Housing Schemes
Housing Schemes : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు గూడులేని పేద ప్రజల కోసం గృహనిర్మాణ పథకాలను అమలు చేస్తున్నాయి . సొంత ఇళ్ళు నిర్మించుకోవాలని కలలుగనేవారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకాల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇలా ఈ ప్రాజెక్టులను ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో చేపడుతున్నారు. ఈ ప్రభుత్వ పథకాలకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏ పత్రాలు అవసరం? ఏ పథకం ద్వారా ఎంత ఆర్థిక సాయం అందుతుంది? తదితర పూర్తి వివరాలకు ఇక్కడ చూద్దాం.
కేంద్ర ప్రభుత్వ 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0' (PMAY-U 2.0):
మెట్రోపాలిటన్ ప్రాంతాలలో నివసిస్తున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) వారికి అందుబాటు ధరల్లో గృహాలను అందించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (PMAY-U 2.0) అనే పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన రెండవ దశలో కోటి మంది లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది.
ఆగస్టు 9, 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ పథకం, సెప్టెంబర్ 1, 2024 నుండి ఐదు సంవత్సరాలలో ఒక లక్ష కొత్త ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద నిర్మించే ప్రతి ఇంటికి రూ.2.50 లక్షల సబ్సిడీ అందించబడుతుంది.
PMAY-U 2.0 పథకం పట్టణ ప్రాంతాల్లోని అర్హతగల లబ్ధిదారులకు దృఢమైన, అన్ని వాతావరణాలకు తట్టుకునే ఇళ్లను అందించడంపై దృష్టి పెడుతుంది. లబ్ధిదారులు వారి అర్హత ప్రకారం PMAY-G లేదా PMAY-U 2.0 కింద ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ పథకం మురికివాడల నివాసితులు, SC/ST వర్గాలు, మైనారిటీలు, వితంతువులు, మహిళలు, వికలాంగులు మరియు ఇతర అణగారిన వర్గాల గృహ అవసరాలను తీర్చడం ద్వారా సమ్మిళిత పట్టణ వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
PMAY-U 2.0 పథకం నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది.
లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం (BLC)
భాగస్వామ్యంలో సరసమైన గృహాలు (AHP)
సరసమైన అద్దె గృహాలు (ARH)
వడ్డీ సబ్సిడీ పథకం (ISS)

Pradhan Mantri Awas Yojana
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు మరియు ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాలు (LIG) లేదా మధ్య ఆదాయ వర్గాలు (MIG) కి చెందినవారు, కుటుంబ సభ్యులెవరి పేరు మీదనా సొంత ఇల్లు లేని వారు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉన్న కుటుంబాలను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలుగా పరిగణిస్తారు. తక్కువ మరియు మధ్య ఆదాయ వర్గాలకు ఆదాయ పరిమితులను వరుసగా రూ. 6 లక్షలు మరియు రూ. 9 లక్షలుగా నిర్ణయించారు.
గత 20 సంవత్సరాలలో ఏదైనా గృహనిర్మాణ పథకం నుండి ప్రయోజనం పొందిన దరఖాస్తుదారులు ఈ పథకం కింద సబ్సిడీ పొందలేరు.
అవసరమైన పత్రాలు ఏమిటి?
అర్హత కలిగిన లబ్ధిదారులు PMAY-U అధికారిక వెబ్‌సైట్ (pmay-urban.gov.in), కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) లేదా వారి స్థానిక పట్టణ సంస్థలు/మునిసిపాలిటీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునేటప్పుడు, దరఖాస్తుదారు మరియు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, ప్రస్తుత బ్యాంకు ఖాతా సమాచారం, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల/సంఘ ధృవీకరణ పత్రం మరియు భూమి రికార్డులు అవసరం.
అర్హతను ధృవీకరించడానికి, దరఖాస్తుదారులు తమ ఆధార్ వివరాలు, ఆదాయం మరియు ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అర్హతను నిర్ధారించిన తర్వాత, అవసరమైన అన్ని వివరాలను సరిగ్గా పూరించడం ద్వారా ఫారమ్‌ను సమర్పించవచ్చు.
పట్టణ అభివృద్ధి మరియు సమానత్వంపై దృష్టి సారించి, PMAY-U 2.0 భారతదేశ పట్టణ గృహ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల లక్షలాది మంది సామాన్యులు తక్కువ ధరకే సొంత ఇళ్లను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

Indiramma Housing Scheme
తెలంగాణ ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్లు :
గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించింది... ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తోంది. ఈ పథకంం కింద నిరాశ్రయులైన పేదలకు ఇళ్లు నిర్మిస్తోంది... తద్వారా పేద కుటుంబాలు సురక్షితంగా జీవించగలవు. ఇప్పటికే ఈ పథకంకోసం లబ్దిదారుల ఎంపిక చేపట్టింది ప్రభుత్వం... త్వరలోనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నారు.
ఇప్పటికే జనవరి 26, 2025న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పథకాలను ప్రారంభించారు. ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంపికచేసి అక్కడ అర్హులందరికీ 100 శాతం పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇలా 562 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమయ్యింది.... మొత్తంగా తొలి విడతలో 72,045 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.
ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అర్హతలు :
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి తెలంగాణ వాసులే అర్హులు. అందులోనూ నివాసం ఉండేందుకు ఇళ్లులేని గిరిజన, దళిత, మైనారిటీ వంటి బలహీన వర్గాలకే ముందుకు ప్రాధాన్యత ఇస్తారు.
తెలంగాణలోనే భారత దేశంలో ఎక్కడా కూడా సొంత ఇల్లు ఉండకూడదు.
ఇల్లు కట్టుకోడానికి సొంత స్థలం కలిగివుండాలి. ఈ స్థలంలో ఇల్లు కట్టుకోడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు.
మొదట సొంత జాగా కలిగినవారికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేసి ఇళ్లు కట్టించి ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఇంటిస్థలం లేనివారికి ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టించి ఇవ్వనున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు పొందాలంటే ఆ కుటుంబం తక్కువ ఆదాయ వర్గానికి చెంది వుండాలి
రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు.
250 చదరపు మీటర్ల స్థలం లేదా స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారు కుటుంబం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండాలి.
గుడిసె, మట్టి ఇల్లు కలిగినవారు కూడా ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హులు.
ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే చేపట్టిన ప్రజా పాలనలో అన్ని పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సమయంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేయనివారు మున్సిపల్ కార్పోరేషన్ లేదా మండల కార్యాలయాలు లేదా గ్రామ పంచాయితీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముందుగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారంను తీసుకుని తగిన వివరాలతో పూరించాలి. అవసరమైన పత్రాలను జతచేసి మున్సిపల్ కార్యాలయం లేదా ఏమ్మార్వో ఆఫీసుల్లో అందించారు.
అవసరమైన పత్రాలు :
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది పత్రాలు దరఖాస్తుతో పాటు జతచేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు
పాస్ పోర్ట్ పైజు ఫోటోలు
పర్మినెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
రేషన్ కార్డు