- Home
- Telangana
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ ఆప్తమిత్రుడు, ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అసలేమైంది?
Peddi Sudarshan Reddy: కేసీఆర్ ఆప్తమిత్రుడు, ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అసలేమైంది?
Peddi Sudarshan Reddy: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు. పల్మనరీ ఎంబోలిజంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) ఇకలేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం (జులై 31) రాత్రి 12:51 గంటలకు కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సంతాప ప్రకటన
తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న… pic.twitter.com/jBSd4vFsfs— BRS Party (@BRSparty) July 31, 2026
పాత గాయమే ముంచెత్తిందా? తీవ్ర చర్చ
పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం వెనుక పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. ఆ గాయం వల్లే నరాల్లో రక్తం గడ్డకట్టి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గా మారిందని, అది కాస్తా ఊపిరితిత్తులకు పాకి పల్మనరీ ఎంబోలిజానికి దారితీసి గుండెపై తీవ్ర ప్రభావం చూపిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు నెల రోజులుగా ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు ఉన్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆరోగ్యం బాగా క్షీణించడంతో మొదట హన్మకొండకు, ఆ తర్వాత యశోద ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి అత్యంత నిపుణులైన డాక్టర్లు శ్రమించినా ఫలితం దక్కలేదు.
నల్లబెల్లి చిన్న పల్లె నుంచి నర్సంపేట లీడర్ వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రయాణం ఇదే
పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1991లో మహబూబియా పంజాథన్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆయనకు భార్య స్వప్న, కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు. సొంత ఊరిలో ఒక చిన్న యూత్ క్లబ్ స్థాపించి, కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగానికి శ్రీకారం చుట్టారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపించగానే అందులో చేరారు. నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారు.
పోరాటాల నుంచి అసెంబ్లీకి..
మలిదశ తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కేంద్రంగా జరిగిన మహాగర్జనలు, నిరసనల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కుంగిపోకుండా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై సుమారు 17,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2018 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా, అలాగే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్) చైర్మన్‌గా, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
సీఎం రేవంత్, కేసీఆర్ సహా ప్రముఖుల ప్రగాఢ సానుభూతి
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "నేను ఒక ఆప్తమిత్రుడిని, నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయాను" అని ఆవేదన చెందారు. తెలంగాణనే శ్వాసగా బతికిన ధీరుడు సుదర్శన్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, తెలంగాణ ఉద్యమంలో పెద్ది చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు నేతలు సంతాపాన్ని తెలియజేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని నర్సంపేట పట్టణం మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలోని లెంకాలపల్లి రోడ్డులో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

