- Home
- Telangana
- JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
JD Lakshminarayana : అధిక లాభాల పేరుతో వల వేసి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ. 2.58 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. వాట్సాప్ గ్రూపులు, నకిలీ యాప్స్ ద్వారా జరిగిన ఈ భారీ మోసం ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రూ. 2.58 కోట్లు గోవిందా ! జేడీ లక్ష్మీనారాయణ సతీమణికి షాక్
నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. సామాన్యులే కాదు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు, చట్టంపై పూర్తి అవగాహన ఉన్నవారి కుటుంబాలు కూడా వీరి వలలో చిక్కుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సంచలనం సృష్టిస్తోంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ), రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారు.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి, ఆమె నుంచి ఏకంగా రూ. 2.58 కోట్లను కేటుగాళ్లు కాజేశారు. అసలు ఈ మోసం ఎలా జరిగింది? విద్యావంతులను సైతం బోల్తా కొట్టించేలా నేరగాళ్లు పన్నిన వ్యూహం ఏమిటి?
వాట్సాప్ మెసేజ్ : మోసానికి తెరలేపింది ఇక్కడే
ఈ మోసపూరిత నాటకం 2025 నవంబర్ చివరి వారంలో ప్రారంభమైంది. ఊర్మిళ మొబైల్ నంబర్‌కు అపరిచిత వ్యక్తుల నుంచి ఓ వాట్సాప్ మెసెజ్ వచ్చింది. "మా నిపుణుల సూచనల ప్రకారం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే, అతి తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో అధిక లాభాలు వస్తాయి" అనేది ఆ మెసేజ్ సారాంశం.
ట్రేడింగ్‌పై పెద్దగా అవగాహన లేని ఊర్మిళ, ఆ మాటలను నిజమేనని నమ్మారు. నేరగాళ్లు ఆమెను స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సేంజ్ 20 (Stock Market Profit Guide Exchange 20) అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అంతేకాకుండా, ఆమె ద్వారా భర్త లక్ష్మీనారాయణ నంబర్‌ను కూడా నవంబర్ 29న ఆ గ్రూపులో యాడ్ చేయించారు. ఇలా కుటుంబం మొత్తాన్ని తమ ట్రాప్‌లోకి లాగడానికి స్కెచ్ వేశారు.
దినేష్ సింగ్ ఎంట్రీ: ఐఐటీ, అమెరికా పీహెచ్‌డీ అంటూ బిల్డప్
గ్రూపులో చేరిన తర్వాత దినేష్ సింగ్ అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. ఇతను గ్రూప్ అడ్మిన్‌గా వ్యవహరిస్తూ తనను తాను గొప్ప విద్యావంతుడిగా పరిచయం చేసుకున్నాడు. "నేను ముంబై ఐఐటీలో చదువుకున్నాను, అమెరికాలో పీహెచ్‌డీ పూర్తి చేశాను" అంటూ నమ్మబలికాడు.
అంతేకాదు, తాను స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని రాశాననీ, అది త్వరలో విడుదల కాబోతోందని చెప్పి సభ్యులను మాయ చేశాడు. తాను సెబీ (SEBI) గుర్తింపు పొందిన మొకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు అందిస్తున్నానంటూ కొన్ని నకిలీ ధ్రువపత్రాలను కూడా గ్రూపులో షేర్ చేశాడు. ఇలాంటి ప్రొఫెషనల్ మాటలతో బాధితులకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు.
500 శాతం లాభాల ఆశ : గ్రూపులో నకిలీ స్క్రీన్ షాట్లు
ఈ ముఠా కేవలం మాటలతోనే సరిపెట్టలేదు. దినేష్ సింగ్‌కు సహకరిస్తూ ప్రియసఖి అనే మరో మహిళ గ్రూపులో హల్చల్ చేసేది. దినేష్ చెప్పిన చిట్కాలు పాటించి తాను లక్షల్లో లాభాలు గడించానంటూ కొన్ని నకిలీ స్క్రీన్ షాట్లను ఆమె పోస్ట్ చేసేది. తాము సూచించిన స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే 500 శాతం వరకు లాభాలు ఖాయమని దినేష్ నమ్మించేవాడు. గ్రూపులో మిగతా సభ్యులు (అందరూ నేరగాళ్ల మనుషులే) కూడా తమకు లాభాలు వచ్చినట్లు పోస్టులు పెడుతుండటంతో, ఊర్మిళ అది నిజమైన ట్రేడింగ్ గ్రూప్ అని నమ్మారు.
నకిలీ యాప్ డౌన్‌లోడ్.. బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడులు
నేరగాళ్ల వ్యూహంలో భాగంగా, బాధితురాలి చేత MCKIEY CM అనే ఒక నకిలీ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయించారు. అందులో ట్రేడింగ్ ఖాతా తెరిపించారు. ఆ యాప్‌లో లాభాలు వస్తున్నట్లు గ్రాఫిక్స్ చూపించి ఆమెను మరింత ఊరించారు. దీంతో 2025 డిసెంబర్ 24 నుండి 2026 జనవరి 5 మధ్య కాలంలో ఊర్మిళ విడతలవారీగా భారీ మొత్తంలో డబ్బును బదిలీ చేశారు.
మొత్తం 19 లావాదేవీల ద్వారా రూ. 2.58 కోట్లను నేరగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు పంపించారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ పెట్టుబడి కోసం ఆమె తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణకు చెందిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు.
విత్‌డ్రా కాకపోవడంతో పోలీసుల ఆశ్రయం
యాప్‌లో చూస్తే లాభాలు భారీగా కనిపిస్తున్నాయి, కానీ ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ మాత్రం పనిచేయడం లేదు. దీని గురించి దినేష్ సింగ్‌ను ప్రశ్నించగా.. "మరింత డబ్బు పెట్టుబడి పెడితేనే విత్‌డ్రా సాధ్యమవుతుంది, లేకపోతే ఉన్న డబ్బు కూడా పోతుంది" అని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఊర్మిళ వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆలస్యం చేయకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బాధితురాలు పంపిన డబ్బును నేరగాళ్లు వెంటనే వేరువేరు మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ఘటనతోనైనా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను గుడ్డిగా నమ్మవద్దని, అధికారిక యాప్స్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

