- Home
- Telangana
- ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి.. ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. హైదరాబాద్‌లో పెరుగుతోన్న కో లివింగ్ కల్చర్
ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి.. ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. హైదరాబాద్‌లో పెరుగుతోన్న కో లివింగ్ కల్చర్
Co Living: విద్య, ఉద్యోగం కోసం పట్టణాల్లో జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరిలో మెజారిటీ హాస్టల్స్‌లో ఉంటుంటారు. అయితే ఒకప్పుడు పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా హాస్టల్స్ ఉండగా.. ఇప్పుడు కో లీవింగ్ అనే కొత్త కల్చర్ వచ్చేసింది.

హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్
హైదరాబాద్‌లో యువత, ఉద్యోగులు, విద్యార్థుల జీవనశైలిలో పెద్ద మార్పు కనిపిస్తోంది. సాధారణంగా ప్రైవేట్ హాస్టల్స్ పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటాయని తెలిసిందే. అయితే ఇప్పుడు హాస్టల్స్, పీజీల స్థానంలో “కో-లివింగ్ హాస్టల్స్” అనే కొత్త కల్చర్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. వీటిలో అన్ని సౌకర్యాలు ఒకే చోట లభిస్తుండటంతో కొత్త తరానికి ఇవి ఆకర్షణీయంగా మారాయి.
సౌకర్యాలు ఎక్కువ
సాంప్రదాయ పీజీలతో పోలిస్తే కో-లివింగ్ హాస్టల్స్ ఖర్చు పరంగా కొంత తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా 24 గంటల నీటి సౌకర్యం, ఏసీ గదులు, వైఫై, వంటసామగ్రి, వాషింగ్ మెషీన్, భద్రత వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. యువతకు స్నేహపూర్వక వాతావరణం లభిస్తుండడంతో వీటిపై ఆసక్తి పెరుగుతోంది.
వివాదాలకు కారణమవుతోన్న కొత్త ట్రెండ్
ఈ సౌకర్యాల వెనుక కొన్ని ఆందోళనకర అంశాలు కూడా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని కో-లివింగ్ హాస్టల్స్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అసాంఘిక వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండే ప్రకటనలు వివాదానికి దారి తీస్తున్నాయి. హాస్టళ్ల చుట్టుపక్కల ఉంటున్న కొందరు ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
పోలీసులు, అధికారులు జోక్యం అవసరమా?
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో హాస్టల్ యజమానులు అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా చట్టపరమైన చర్యలు ఆలస్యం అవుతున్నాయని సామాజిక వేత్తలు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం ఈ హాస్టల్స్‌పై కఠిన పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి, లైసెన్స్ వ్యవస్థను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి
కో-లివింగ్ హాస్టల్ ఎంచుకునే ముందు భద్రతా సౌకర్యాలు, నివాస నిబంధనలు, ఇతర వ్యక్తుల ప్రవర్తన, అద్దె వివరాలు మొదలైనవి జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలియని చోట నివసించేటప్పుడు హాస్టల్ రిజిస్ట్రేషన్, సీసీటీవీ పర్యవేక్షణ ఉన్నాయా అనే అంశాలు తప్పనిసరిగా పరిశీలించాలి. తల్లిదండ్రులు పిల్లల వసతి, కదలికలపై దృష్టి ఉంచితే ప్రమాదాలు తగ్గుతాయి.
కో-లివింగ్ – సంస్కృతి మార్పా? లేక ప్రమాద సంకేతమా?
సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఇద్దరు మేజర్లు కలిసి నివసించడంలో చట్టపరమైన తప్పు లేదని చెబుతారు. కానీ సామాజికంగా ఇది విభిన్నమైన ధోరణిగా భావిస్తున్నారు. కొందరు దీన్ని ఆధునిక జీవన విధానంగా చూస్తే, మరికొందరు దీని వల్ల నేరాలు, ఘోరాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఏ ప్రదేశాల్లో ఉన్నాయి.?
హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ ట్రెండ్ నగర సంస్కృతిపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కొత్త తరహా వసతులు ఆర్థికంగా సౌకర్యవంతమైనవే అయినా, సామాజికంగా వాటి ప్రభావం పై లోతైన చర్చ కొనసాగుతోంది.