అనుకున్నంతా జరిగింది... అధికార బిఆర్ఎస్ కు షాకిస్తూ మాజీ ఎమ్మెల్యే రాజీనామా
బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మరో మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు.
Manukonduru
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్దమై ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించిన అధికార బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. మానుకొండూరు టికెట్ ఆశించి భంగపడ్డ మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారత రాష్ట్ర సమితి పార్టీకీ రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటటిస్తానని మోహన్ తెలిపారు.
Manukonduru
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ ఎపీ బోయినిపల్లి వినోద్ అభ్యర్థన మేరకు టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) లో చేరానని ఆరేపల్లి మోహన్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు హుజురాబాద్, మునుగోడు బై ఎలక్షన్స్, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసానని అన్నారు. మానుకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవర్తన, పనితీరు బాగాలేదని అదిష్టానానికి చెప్పానే తప్ప పార్టీకి నష్టం చేసేలా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు.కానీ తనకు సరయిన ప్రాధాన్యత దక్కకపోవడం, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేకపోతున్నానని తన రాజీనామా లేఖలో మోహన్ పేర్కొన్నారు.
Manukonduru
బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని... బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని భావించానని మాజీ ఎమ్మెల్యే అన్నారు. అందువల్లే మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో వున్న రాజకీయ బంధాన్ని వదిలేసి బిఆర్ఎస్ లో చేరానని అన్నారు. కానీ రాష్ట్రంకోసం ప్రాణాలుసైతం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేవని అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలతో బిసి, దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అందువల్లే ప్రజల ప్రక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నానని... అందువల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆరేపల్లి మోహన్ పేర్కొన్నారు.
Manukonduru
బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వెంటనే మోహన్ రాజీనామాకు సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. కానీ సీనియర్ నాయకులు బోయినిపల్లి వినోద్ బుజ్జగించడంతో ఆయన కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. అయితే బిఆర్ఎస్ అదిష్టానం నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇక పార్టీలో కొనసాగి లాభం లేదని నిర్ణయానికి వచ్చారు. అందువల్లే బిఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా వున్నట్లు... ఆ దిశగా చర్చలు కూడా ప్రారంభించినట్లు సమాచారం.
arepalli mohan
తన సన్నిహితులు, అనుచరులతో చర్చించి త్వరలోనే ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని మోహన్ అన్నారు. అయితే ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన మోహన్ కు కాంగ్రెస్ టికెట్ పై హామీ లభించినట్లు... అందువలే ఆయన బిఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు రాజకీయ చర్చ జరుగుతోంది. మరి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎటు వెళతారో త్వరలో తేలనుంది.