IMD Rain Alert : నవంబర్ లో మరో అల్పపీడనం రెడీ... ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Heavy Rains Expected in November : అక్టోబర్ లో మాదిరిగానే నవంబర్ లో కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

నవంబర్ లోనూ భారీ వర్షాలే
IMD Rain Alert : వర్షాకాలం ముగిసింది... అయినా తెలుగు రాష్ట్రాలను వానలు విడిచిపెట్టడంలేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా... అదికాస్తా మొంథా తుపానుగా మారి ఏస్థాయిలో బీభత్సం సృష్టించిందో మనందరం చూశాం. ఇంకా ఈ పరిస్థితులు చక్కబడనేలేదు... తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుండి ఇంటికి చేరుకుంటున్నారు.. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ సంచలన ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో నవంబర్ లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బలహీనపడిన మొంథా
ఇప్పటికే తీరందాటిన మొంథా తుపాను పూర్తిగా బలహీనపడిపోయి అల్పపీడనంగా మారింది... విదర్భ పరిసరాల్లో ఇది కేంద్రీకృతమై ఉంది... దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో మళ్లీ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని... త్వరలోనే మరో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.
మరో అల్పపీడనం రెడీ
అండమాన్ పరిసరప్రాంతాల్లో నవంబర్ 4న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ముందుకు సాగుతూ బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని... అక్టోబర్ చివర్లో మాదిరిగానే నవంబర్ ఆరంభంలో వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది. ఇలా మొంథా తుపానుతో ప్రారంభమైన జోరువానలు మరికొన్నిరోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే
తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా నవంబర్ ఆరంభంలో వర్షాలు కొనసాగుతాయని అంచనా వేశారు. నవంబర్ 2 నుడి 7వ తేదీ వరకు వెస్ట్, సౌత్ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే ఈ రెండ్రోజులు (అక్టోబర్ 30, నవంబర్ 1న) మాత్రం పొడి వాతావరణం ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా ఇదే వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
నవంబర్ సెకండ్ వీక్ నుండే శీతాకాలం
నవంబర్ ఫస్ట్ వీక్ తోనే వర్షాకాలం ముగుస్తుందని... సెకండ్ వీక్ నుండి శీతాకాలం ప్రారంభం అవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నవంబర్ 8 నుండి ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభం అవుతుందని... చల్లని గాలులు వీస్తాయని తెలిపారు. మధ్యలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు వంటివి ఏర్పడి రెండుమూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇలా నవంబర్, డిసెంబర్ లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని... అప్పుడప్పుడు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
ఏపీలో మొంథా తుపాను విధ్వంసం
ఇదిలావుంటే ఇటీవల మొంథా తుపాను సృష్టించిన విధ్వంసంపై ప్రాథమిక అంచనాకు వచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ తుపాను కారణంగా అనేక రకాలుగా నష్టం జరిగింది... ఇది దాదాపు రూ.5,265 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అత్యధికంగా ఆక్వా రంగంలో తుపాను వల్ల ఎక్కువ నష్టం జరిగిందని... దాదాపు 1,270 కోట్లుగా అంచనా వేసింది కూటమి ప్రభుత్వం. ఇక వ్యవసాయ రంగంలో రూ.829, హార్టికల్చర్ లో రూ.39, సెరికల్చర్ లో రూ.65 కోట్ల నష్టం జరిగిందట. పశుసంవర్థకశాఖలో రూ.71లక్షల నష్టం జరిగిందని... కొన్నిచోట్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు. మున్సిపల్ శాఖలో రూ.109కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.