- Home
- Telangana
- Rain Alert : తీరం దాటిన వాయుగుండం .. ఇక ఈ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ తో అల్లకల్లోలం తప్పదా?
Rain Alert : తీరం దాటిన వాయుగుండం .. ఇక ఈ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ తో అల్లకల్లోలం తప్పదా?
Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరపెడుతున్న వాాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మరింత జోరందుకోనున్నాయి. ఏఏ జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

తీరందాటిని వాయుగుండం
Rain Alert : సముద్రంలో ఉండగానే భారీ వర్షాలకు కారణమైన వాయుగుండం భూమిపైకి చేరింది. బంగాళాఖాతంలో నిన్న(శుక్రవారం) ఏర్పడిన వాయుగుండం కొద్దిసేపటిక్రితమే తీరం దాటినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ (APSDMA) వెల్లడించింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంగా భూమివైపు దూసుకొచ్చిన ఈ వాయుగుండం ఒడిషాలోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటింది. ఇది దక్షిణ ఒడిషా మీదుగా చత్తీస్ ఘడ్ వైపు పయనిస్తూ బలహీన పడుతుందని వెల్లడించింది.
హైదరాబాద్ లో మూసీ నది వరదలు
ఈ వాయుగుండాని స్థానిక వాతావరణ పరిస్థితులు తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే కుండపోత వర్షాలతో నదులు, వాగులువంకలు ప్రమాదకరంగా మారాయి. హైదరాబాద్ లో మూసీ నదికి దశాబ్దాల తర్వాత వరదలు సంభవించాయి. జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తు నీటిని దిగువకు వదులుతున్నారు... దీంతో వేల క్యూసెక్కుల నీరు మూసీలోకి చేరడంతో పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. ఇలా హైదరాబాద్ లోని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వికారాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ జారీచేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట, మోమిన్ పేట ప్రాంతాల్లో 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. జోగులాంబ జిల్లా గట్టులో 12, భూపాలపల్లి జిల్లా కాటారంలో 12, మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 11, గండీడ్ లో 10, రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ లో 9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ జిల్లాలకు పొంచివున్న వర్షం ముప్పు
ఇవాళ (సెప్టెంబర్ 27న) ఆదిలాబాద్, కోమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూండెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలోనూ భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
శుక్రవారం (26 సెప్టెంబర్)ఉదయం 8:30 గంటల నుండి శనివారం(27 సెప్టంబర్) ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం 5.1మిమీ నమోదైనట్లు APSDMA తెలిపింది. అత్యధికంగా కర్నూల్ జిల్లా అదోనిలో 115.7 మి.మీ, కృష్ణా జిల్లా బాపులపాడులో 103.7, అనంతపురం జిల్లా ఆత్మకూరులో 96, కర్నూల్ జిల్లా కృష్ణగిరిలో 89, నంద్యాల జిల్లా మహానందిలో 86, పాణ్యంలో 82 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎక్స్ వేదికన ప్రకటించింది.