- Home
- Telangana
- Rain Alert : వాయుగుండం ఎఫెక్ట్ తో అల్లకల్లోలమే... ఈ ఒక్కరోజే 200 మి.మీ వర్షపాతం, ఈ జిల్లాల ప్రజలు బిఅలర్ట్
Rain Alert : వాయుగుండం ఎఫెక్ట్ తో అల్లకల్లోలమే... ఈ ఒక్కరోజే 200 మి.మీ వర్షపాతం, ఈ జిల్లాల ప్రజలు బిఅలర్ట్
Rain Alert : ఊహించినట్లే జరుగుతోంది… వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షాలు తప్పేలా లేవు. ఇవాళ ఒక్కరజే 200 మి.మీ పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Rain Alert : తెలుగు రాష్ట్రాలను కుండపోత వర్షాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాల ప్రభావంతో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఏకంగా 20 సెం.మీ అంటే 200 మి.మీ పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. ఈ స్థాయిలో జోరువానలు కురిస్తే వరదలు తప్పవు.. కాబట్టి నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.
వాయుగుండం ఎఫెక్ట్ తో జోరువానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గడిచిన గంటకు 10కిమీ వేగంతో కదులుతోందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి ఒడిషాలోని పూరికి 60 కి.మీ, గోపాల్‌పూర్ కి 70కి.మీ... ఏపీలోని కళింగపట్నంకు 180 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఉన్నట్లు చెబుతున్నారు, ఇవాళ ఏ క్షణమైనా ఈ వాయుగుండం తీరందాటే అవకాశాలున్నాయని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
నేడు తీరం దాటనున్న వాయుగుండం
వాయుగుండం తీరందాటే సమయంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుందని... తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. కాబట్టి తీరప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
తెలంగాణలో కుండపోత తప్పదట
తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే జోరువర్షాలు కురుస్తున్నాయి... ఈ 24 గంటలు ఇవి కుండపోతగా మారతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 21 సెం.మీ లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారంటేనే ఏ స్థాయిలో ఉండనున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పది జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాల్లో ఆరెంజ్, మిగతా 16 జిల్లలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇప్పటికే శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఉదయం వరకు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట , మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :26-09-2025@TelanganaCS@DCsofIndia@IASassociation@TelanganaDGP@TelanganaCMO@GHMCOnline@HYDTP@IasTelangana@tg_weather@CommissionrGHMC@Comm_HYDRAA@Indiametdeptpic.twitter.com/s0QTF8eldf
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 26, 2025
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
ఇవాళ (సెప్టెంబర్ 27, శనివారం) నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండల్లా మరాయి. భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది... దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది... చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జిలు మూసివేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను నేడు వాయుగుండం తాకనుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది.
విపత్కర పరిస్థితుల్లో ఈ నెంబర్లకు కాల్ చేయండి
భారీ వర్షాలు, విపత్కర వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 కు సంప్రదించాలని సూచిస్తున్నారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది... కాబట్టి పరివాహకప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.