Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ కాబోతోందా..? ఇక్కడ వాయుకాలుష్యం ఆ స్థాయికి చేరుకుంటోందా..? అంటే కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది.

హైదరాబాద్ లో వాయుకాలుష్యం
Air Pollution : దేశ రాజధాని డిల్లీ పేరు వినగానే ఒకప్పుడు ఎర్రకోట వంటివి చారిత్రక స్థలాలు గుర్తుకువచ్చేవి. కానీ ఇప్పుడు కాలుష్యం గుర్తుకువస్తోంది. దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయింది మన దేశ కేపిటల్. డిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోకుంటే హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా ఉంది. నగరంలో రోజురోజుకు వాయుకాలుష్య తీవ్రత పెరిగిపోతోందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి.
హైదరాబాద్ లో వాయుకాలుష్యం
గత ఏడాదికాలంగా హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే ఆందోళనకర విషయాలు బైటపడుతున్నాయి. సాధారణంగా ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 50 లోపు ఉంటే గాలి స్వచ్చంగా ఉన్నట్లు. కానీ డిల్లీల్లో AQI 400 ఉంటుంది... అంటే ఏస్థాయిలో కాలుష్యం ఉందో అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్ లో కూడా ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు పడిపోతోంది... తాజాగా AQI 253 గా నమోదయ్యింది. ఇది నగరం కాలుష్యకోరల్లో చిక్కుకుంటోందనే డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే అత్యధిక వాయుకాలుష్యం
ఆసక్తికర విషయం ఏమిటంటే పాత హైదరాబాద్ లో వాయుకాలుష్యం తక్కువగా ఉంది... బాగా అభివృద్ధి చెందిన హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి ప్రాంతాల్లోనే AQI దారుణ స్థితికి చేరుకుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాల్లో వాయుకాలుష్యం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గతవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ (శేరిలింగంపల్లి) ప్రాంతంలో అత్యధిక వాయుకాలుష్యం ఉన్నట్లు తేలింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యధికంగా 253 గా నమోదయ్యింది. ఇక పటాన్ చెరు పరిధిలోని అమీన్ పూర్ లో 201 AQI నమోదయ్యింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోనూ 150 AQI ఉంటోంది. పాశమైలారం, బొల్లారం, జీడిమెట్ల, పటాన్ చెరు వంటి ఇండస్ట్రియల్ ఏరియాల్లో AQI 200 చేరువగా ఉంటోంది. ఇలా హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది.
వాయుకాలుష్యానికి కారణాలు
పల్లెటూళ్లు, చిన్నచిన్న పట్టణాల్లో కంటే నగరాల్లో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం వాహనాలు రద్దీ. వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో వాయు కాలుష్య ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి.
పారిశ్రామిక అభివృద్ధి కూడా వాయుకాలుష్యానికి ప్రధాన కారణం. పరిశ్రమల నుండి వెలువడే రసాయన వాయువుల వల్ల గాలి పొల్యూట్ అవుతుంది. అందుకే పారిశ్రామిక వాడల్లో గాలి నాణ్యత దారుణంగా ఉంటుంది.
వాయు కాలుష్యానికి వ్యవసాయం కూడా కారణంగా మారుతోంది. వ్యవసాయ వ్యర్థాలను రైతులు పొలాల్లోనే తగలబెట్టడం వల్ల గాలి కాలుష్యంతో నిండిపోతోంది. డిల్లీలో అత్యధికంగా వాయుకాలుష్యం ఉండటానికి ఇదీ ఓ కారణమే.
వాతావరణ పరిస్థితులు కూడా వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వెలిగించి చలికాచుకుంటారు. అలాగే వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య కారకాలు కూడా గాల్లో కలుస్తాయి. అయితే చలికాలంలో గాలి కదలిక తక్కువగా ఉండటంతో కాలుష్య కారకాలు ఎక్కువకాలం ఉంటాయి.
న్యూఇయర్, దీపావళి వంటి పండగలతో పాటు ఏ శుభకార్యం ఉన్నా, వేడకలున్నా టపాసులు కాలుస్తుంటారు. దీనివల్ల కూడా కాలుష్యం పెరుగుతోందని పర్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యాన్ని నివారించే మార్గాలు
వాహనాల ద్వారా వాయుకాలుష్య ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి. అందుకే ప్రతిఒక్కరు సొంత వాహనాలను వాడితే వాయుకాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టిసి బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లు వంటివి ఉపయోగించాలి. దీనివల్ల వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కూడా కంట్రోల్ లో ఉంటుంది.
సాంప్రదాయ ఇందనాలైన పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తాయి. అలాకాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వల్ల వాయుకాలుష్యం ఉండదు. అందుకే వీటిని ఎక్కువగా ఉపయోగించాలి. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.
పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ చాలా అవసరం. పరిశ్రమల్లో వెలువడే విషపూరిత వాయువులను అలాగే గాల్లోకి వదిలేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రమాదకర వాయువులను శుద్ది చేశాకే గాలిలోకి విడుదల చేయాలి.
పునరుత్పాదక శక్తి అంటే సౌర, పవన విద్యుత్ ను ఎక్కువగా ఉపయోగించాలి. దీనివల్ల సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగుతుంది.

