5Gకి గుడ్ బై, ఇక అంతా 6Gనే.. ఎప్పట్నుంచి అందుబాటులోకి రానుందో తెలుసా?
6G కౌంట్‌డౌన్ మొదలైంది. క్వాల్‌కామ్ 6G టెక్నాలజీ పరీక్షలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది… ఎప్పట్నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారో కూడా ప్రకటించారు.

6G వచ్చేస్తోంది...
ప్రస్తుతం 5G జమానా నడుస్తోంది... టెలికాం రంగంలో ఈ టెక్నాలజీలో తీవ్రమైన పోటీ నెలకొంది. భారతదేశంలో ఇంకా 5G సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేవు... ఇంకా కొన్ని టెలికాం సంస్థలు 4G నే కొనసాగిస్తున్నాయి. ఇలా 4G నుండి 5G కి ట్రాన్స్ ఫార్మ్ అయ్యే స్థాయిలో ఉండగానే 6G రెడీ అవుతోంది. ఈ సూపర్ ఫాస్ట్ సిక్త్ జనరేషన్ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసెస్ మరో రెండుమూడు ఏళ్లలో అందుబాటులోకి రానున్నాయి. 2028లో ఫస్ట్ 6G సేవలు ప్రారంభిస్తామని క్వాల్ కామ్ చెబుతోంది.
6G లక్ష్యం 2028
హవాయిలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో క్వాల్‌కామ్ (Qualcomm) 6G టెక్నాలజీ రాకపై కీలక ప్రకటన చేసింది. 2028 నాటికే వాణిజ్య పరికరాలతో 6G టెక్నాలజీ పరీక్షలు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందని క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్ తెలిపారు. 2018లోనే 5G టెక్నాలజీని పరిచయం చేసిన తమ సంస్థ రికార్డును గుర్తుచేస్తూ, 6Gని అనుకున్నదానికంటే వేగంగా తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
AIయే తదుపరి ఇంటర్‌ఫేస్
అమోన్ ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రధానాంశంగా ఉంది. కొత్త తరం స్నాప్‌డ్రాగన్ చిప్‌లు అన్ని పరికరాల్లో AIని పొందుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన నొక్కిచెప్పారు. "మేము AIని ప్రతిచోటా తీసుకురాబోతున్నాం, ఇది తర్వాతి తరం ఆవిష్కరణలకు దారితీస్తుంది" అని ఆయన అన్నారు. త్వరలో AI పరికరాల్లో ప్రాథమిక యూజర్ ఇంటర్‌ఫేస్ (UI)గా మారుతుందని.. ఇది రోజువారీ పనులను నిర్వహించే విధానాన్ని పూర్తిగా మారుస్తుందని ఆయన వివరించారు.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5
10వ ఎడిషన్‌గా జరిగిన ఈ స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌ల క్వాల్‌కామ్ తన అత్యాధునిక మొబైల్, కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, స్నాప్‌డ్రాగన్ X2 ఎలైట్‌లను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌లు AI సామర్థ్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, మెరుగైన పనితీరు, శక్తి సామర్థ్యంతో రూపొందించబడ్డాయి. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పీసీలు, వేరబుల్స్, ఇతర కనెక్టెడ్ గాడ్జెట్‌లలో కూడా AI ప్రభావం విస్తరిస్తుందని అమోన్ వివరించారు.
గూగుల్, అడోబ్ భాగస్వామ్యం
ఈ సమ్మిట్‌లో క్వాల్‌కామ్ భాగస్వాములైన అడోబ్ (Adobe) సీఈఓ శంతను నారాయణ్, గూగుల్ (Google)కు చెందిన రిక్ ఓస్టెర్లో కూడా పాల్గొన్నారు. క్రియేటర్లకు క్వాల్‌కామ్ టెక్నాలజీ ఎలా సాధికారత కల్పిస్తుందో నారాయణ్ వివరించారు. అదే సమయంలో స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నాల గురించి ఓస్టెర్లో మాట్లాడారు. గూగుల్ జెమిని మోడల్స్, అసిస్టెంట్ ఇకపై పీసీ డొమైన్‌లోకి కూడా వస్తాయని ఆయన పేర్కొన్నారు.