ఒప్పోతో వన్‌ప్లస్ విలీనంపై కీలక నిర్ణయం.. త్వరలోనే మరో కొత్త బ్రాండ్.. ?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వన్‌ప్లస్, ఒప్పో వినియోగదారులకు శుభవార్త అందించాయి. ఈ రెండు వేర్వేరు సంస్థలు ఇప్పుడు విలీనం కానున్నాయి. ఈ కారణంగా ఇప్పుడు వన్‌ప్లస్ ఒప్పో సబ్ బ్రాండ్‌గా మారనుంది. అయితే ఈ రెండు కంపెనీలు బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్నాయి.
వన్‌ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు అండ్ సిఇఒ పెట్ లా ఈ సమాచారాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా ఇచ్చారు. పెట్ లా తన బ్లాగులో కస్టమర్ల కోసం మెరుగైన ఉత్పత్తులను రూపొందించడానికి ఒప్పో, వన్‌ప్లస్ కలిసి పనిచేస్తాయని, అలాగే వాటి ఉత్పత్తుల కోసం సాఫ్ట్‌వేర్‌ను వేగంగా రూపొందించగలవని అన్నారు.
వన్‌ప్లస్, ఒప్పో తో కలిసి పోవడంతో సంస్థ ఉత్పత్తులకు మంచి సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఏడాది చైనాలో ప్రారంభించిన వన్‌ప్లస్ 9 సిరీస్‌ను ఒప్పో కలర్ ఓఎస్ తో ప్రవేశపెట్టారు. చైనాలో వన్‌ప్లస్ ఇప్పటికే హైడ్రోజన్ ఓఎస్ తో ఉత్పత్తులను అందిస్తోంది. ఇతర మార్కెట్లలో కంపెనీ తన ఉత్పత్తులను ఆక్సిజన్ ఓస్‌తో అందిస్తుంది.
ఉత్పత్తులను స్వతంత్రంగా ప్రారంభిస్తుంది
రెండు సంస్థల విలీనం సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పీట్ లా తన బ్లాగులో పోస్ట్ చేశారు. అయితే ఈ రెండు సంస్థల విలీనం తరువాత భవిష్యత్ ప్రణాళికలను పెట్ లా వెల్లడించలేదు. అయితే రెండు బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఎప్పటిలాగే స్వతంత్రంగా లాంచ్ చేయడం కొనసాగిస్తాయి. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అని తెలిపారు.
గత ఏడాది 2018లో రియల్ మీ బ్రాండ్‌ను ఒప్పో సబ్ బ్రాండ్‌గా భారతదేశంలో ప్రారంభించారు. ఇప్పుడు రియల్ మీ తన ఉత్పత్తులను స్వతంత్రంగా విడుదల చేస్తోంది. రియల్ మీ ఉత్పత్తులను ఇంతకు ముందు కలర్‌ఓఎస్‌తో అందించారు. గత సంవత్సరం, కంపెనీ రియల్ మీ యుఐని ప్రారంభించింది.
వన్‌ప్లస్ భవిష్యత్తుకు కీలక మలుపు
వన్‌ప్లస్ భవిష్యత్తుకు ఈ విలీనం ఒక కీలక మలుపు అని రుజువు చేస్తుందని పెట్ లా పేర్కొన్నారు. అలాగే సంస్థ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరిస్తోంది. వినియోగదారులు ఇప్పుడు సంస్థ ఉత్పత్తి శ్రేణిలో అనేక రకాల ఆప్షన్స్ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఎప్పటిలాగే కంపెనీ అధిక నాణ్యత ఉత్పత్తులు, అనుభవాన్ని ఇస్తుంది.
ఈ విలీనం మా వినియోగదారులకు సానుకూలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అని పెట్ లా బ్లాగులో రాశారు. ఒప్పో తో ఈ లోతైన భాగస్వామ్యం కారణంగా మాకు ఎక్కువ వనరులు ఉంటాయి. దీని ద్వారా మేము వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులను అందించగలుగుతాము అని తెలిపారు.