మీ Google స్టోరేజీ నిండిపోయిందా..? అయితే ఈ 5 ఆప్షన్లతో ఖాళీ చేసేయండి!
15 జీబీ గూగుల్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుందా? డబ్బు పెట్టకుండా ఖాళీ చేసుకునే స్మార్ట్ చిట్కాలు, టూల్స్, ట్రిక్స్ గురించి తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us

గూగుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే చాలా మంది వినియోగదారులకు గూగుల్ స్టోరేజ్ నిండిపోవడం ప్రధాన సమస్య. ఫొటోలు, వీడియోలు, మెయిల్స్ లాంటి డేటా పెరిగిపోతుండటంతో, 15GB ఉచిత స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. గూగుల్ ఫొటోస్, జీమెయిల్, డ్రైవ్ వంటి సేవలన్నింటికీ ఇదే స్టోరేజ్ ఉపయోగపడటం వల్ల ఏ ఒక్క సేవలో ఎక్కువ డేటా ఉండినా మొత్తం ఖాతా ప్రభావితమవుతుంది.
గూగుల్ వన్ స్టోరేజ్ మేనేజర్
ముందుగా, మీరు స్టోరేజ్ ఎంత వాడుతున్నారో తెలుసుకోవడం చాలా అవసరం. గూగుల్ వన్ స్టోరేజ్ మేనేజర్ అనే టూల్ ద్వారా మీ స్టోరేజ్‌ను విశ్లేషించుకోవచ్చు. దీని ద్వారా ఏ సర్వీస్ ఎక్కువగా డేటా వాడుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా, గూగుల్ ఫొటోస్ ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. అందులో దాచిన అవాంఛిత వీడియోలు, స్పష్టతలేని ఫొటోలు, స్క్రీన్‌షాట్‌లు, డూప్లికేట్ ఫైళ్లను తొలగిస్తే తక్కువ సమయంలో ఎక్కువ స్థలాన్ని ఖాళీగా ఉంచుకోవచ్చు.
కంప్రెస్ విధానం
మరొక చిట్కా కంప్రెస్ విధానం. గూగుల్ ఫొటోస్‌లోని ‘‘స్టోరేజ్ సేవర్’’ మోడ్‌ను ఎంచుకుంటే, కొత్తగా అప్‌లోడ్ అయ్యే ఫైళ్ల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇప్పటికే ఉన్న ఫొటోలు, వీడియోలను కూడా కంప్రెస్ చేయాలంటే photos.google.com వెబ్‌సైట్‌కు వెళ్లి ‘‘రికవర్ స్టోరేజ్’’ ఎంపికను ఉపయోగించాలి. ఇది ఒకసారి జరిగాక ఆ ఫైళ్ల నాణ్యతను తిరిగి పునరుద్ధరించలేరు, కాబట్టి ఎంపిక చేసేముందు జాగ్రత్తగా ఆలోచించాలి.
టేక్‌ఔట్ సర్వీస్
వేరొక చక్కటి పరిష్కారం టేక్‌ఔట్ సర్వీస్ ఉపయోగించడం. takeout.google.com ద్వారా మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకుని, ల్యాప్‌టాప్ లేదా ఇతర క్లౌడ్ స్టోరేజ్‌లలో భద్రపర్చుకోవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న డేటాను జిప్ ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్ ఖాతాలో నుంచి ఆ ఫైళ్లను తొలగించి స్టోరేజ్‌ను ఖాళీ చేయవచ్చు.
క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్లు
ఆపైన టెలికాం కంపెనీలు కూడా క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్లు అందిస్తున్నాయి. జియో ప్లాన్లలో 50 జీబీ వరకు, ఎయిర్‌టెల్ ప్లాన్లలో 100 జీబీ వరకు స్టోరేజ్‌ను కొన్ని నెలలు ఉచితంగా ఉపయోగించవచ్చు. ముఖ్యమైన ఫైళ్లను అక్కడ భద్రంగా పెట్టుకుంటే గూగుల్ స్టోరేజ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అయితే డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా బ్యాకప్ చేయడం వేగంగా, సురక్షితంగా ఉంటుంది.
కొత్త జీమెయిల్ ఖాతా
ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే, మరొక కొత్త జీమెయిల్ ఖాతా తెరచి దానిలో ఫొటోలు, వీడియోలు బ్యాకప్ చేయడం. ఈ విధంగా మీరు ప్రధాన ఖాతాలో మెయిల్స్‌కు మాత్రమే స్థలం వదిలి పెట్టొచ్చు. దీంతో స్టోరేజ్ నిండిన సమస్యను తప్పించుకోవచ్చు.
కెమెరా ఫోల్డర్
ఫొటోస్ బ్యాకప్ కోసం కెమెరా ఫోల్డర్ మాత్రమే ఎంచుకోవడం, అవసరం లేని ఫైళ్లను తొలగించడం. అలాగే మీకు అవసరమైన ఫొటోలకే బ్యాకప్ ఇవ్వడం కూడా బెటర్. ముఖ్యమైన డాక్యుమెంట్ల కోసం గూగుల్ డ్రైవ్ కాకుండా డిజీలాకర్‌ను ఉపయోగించడం కూడా మంచి ఎంపిక.