Smartphones: ఇండియన్స్ ఎక్కువగా మనసుపారేసుకుంటున్న ఫోన్స్ ఇవే..
Smartphones: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు బడ్జెట్ ఫోన్లకు డిమాండ్ తగ్గుతుంటే.. మరోవైపు ఖరీదైన ఫోన్ల అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 17 సిరీస్ దూసుకెళ్తోంది. మార్కెట్‌లో ఈ మార్పులకు కారణాలేంటి?

భారత స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ల పతనం 2026
2026 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 20% క్షీణించాయి. ఇందులో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగం తీవ్రంగా నష్టపోయింది. అదే సమయంలో, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరగడం గమనార్హం. వినియోగదారులు తమ తదుపరి మొబైల్‌ను ఎంచుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో భారీ క్షీణత
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మెమరీ చిప్ కొరత కారణంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మందగమనంలో ఉంది. అయితే, ఈ ప్రభావం అన్ని ధరల విభాగాలపై ఒకేలా లేదు. 'సైబర్‌మీడియా రీసెర్చ్' (CMR) తాజా నివేదిక ప్రకారం, 2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు వార్షిక ప్రాతిపదికన 20% తగ్గాయి. ఇందులో తక్కువ, మధ్యస్థ ధరల ఫోన్లపైనే ఎక్కువ ప్రభావం పడింది. కానీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు మాత్రం వినియోగదారుల ఆదరణ తగ్గలేదు. మార్కెట్ మొత్తం నెమ్మదించినా, రూ.25,000 పైబడిన ఫోన్లు వృద్ధిని నమోదు చేశాయి.
తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లకు పెద్ద దెబ్బ
రూ.7,000 కంటే తక్కువ ధర ఉన్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో, 2026 మూడో త్రైమాసికంలో షిప్‌మెంట్లు వార్షిక ప్రాతిపదికన 94% పడిపోయాయి. అలాగే, రూ.7,000 నుండి రూ.24,999 మధ్య ఉన్న మిడ్-రేంజ్ విభాగం కూడా 42% పతనాన్ని చూసింది.
మెమరీ చిప్‌లు, విడిభాగాల ధరలు పెరగడం వల్లే స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగాయి. దీనివల్ల బడ్జెట్ వినియోగదారులు కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ కావడం కష్టంగా మారింది. వినియోగదారులు కొత్త ఫోన్లు కొనేబదులు, పాత ఫోన్లనే ఎక్కువ కాలం వాడుతున్నారు. ఇది తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడిన కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది.
ఈ మందగమనం అనేక అగ్రశ్రేణి బ్రాండ్లపై ప్రభావం చూపింది. వివో (Vivo) షిప్‌మెంట్లు 25% తగ్గాయి. ఒప్పో (OPPO) కూడా అదే స్థాయి క్షీణతను నమోదు చేసింది. పోకో (POCO) సహా షావోమీ (Xiaomi) షిప్‌మెంట్లు 28% తగ్గాయి. 17% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్న శాంసంగ్ (Samsung) కూడా 8% క్షీణతను చవిచూసింది.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు కొనసాగుతున్న వృద్ధి
తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ఢీలా పడుతుంటే, ప్రీమియం విభాగం మాత్రం వృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2026 మూడో త్రైమాసికంలో రూ.25,000 నుండి రూ.49,000 మధ్య ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లు 38% వృద్ధిని సాధించాయి. రూ.50,000 నుండి రూ.1 లక్ష మధ్య ఉన్న సూపర్-ప్రీమియం విభాగం కూడా 32% పెరిగింది.
కొత్త స్మార్ట్‌ఫోన్ల కోసం ఖర్చు చేసే వినియోగదారులు, ఎక్కువ ధర ఉన్న ఫోన్లకే మొగ్గుచూపుతున్నారని ఇది స్పష్టం చేస్తోంది. మెరుగైన పనితీరు (Performance), కొత్త ఫీచర్లు, ఏఐ (AI) సామర్థ్యాలపై ఉన్న ఆసక్తే ఈ డిమాండ్‌కు ప్రధాన కారణం.
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 9% వాటా ఉన్న యాపిల్ (Apple) మొత్తం షిప్‌మెంట్లలో, ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్ వాటాయే 53% ఉంది. వన్‌ప్లస్ (OnePlus) కూడా 27% వృద్ధితో ప్రత్యేకంగా నిలిచింది. రూ.20,000 లోపు విభాగంలో దాని షిప్‌మెంట్లు ఏకంగా 500% పెరిగాయి. మరోవైపు, 'Ai+' వంటి నిర్దిష్ట మార్కెట్ కంపెనీలు కూడా వార్షిక ప్రాతిపదికన 247% భారీ వృద్ధిని నమోదు చేశాయి.













