AI Technology : ఏమిటీ... పిల్లల్ని కనడంకోసం ఏఐ రోబోల సహాయమా..!
AI Technology : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోల సాయంతో పిల్లలు కంటున్నాారట. ఇలా ఏఐ ఆధారిత రోబో IVF పద్దతి వైద్యరంగంలో మరో విప్లవాన్ని సృష్టించేలా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఏఐ టెక్నాలజీ అద్భుతాలు...
AI Technology : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ... నేటి టెక్ జమానాలో మరో విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఈ ఏఐ టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చేసింది… అనేక రంగాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు వైద్యరంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తోంది. ఆల్రెడీ వైద్యరంగంలో రోబోల వినియోగం ఎప్పట్నుంచో ఉంది... దీనికి ఇప్పుడు ఏఐని జోడించడంతో మరింత ఖచ్చితమైన వైద్యం సాధ్యమవుతోంది. ఇలా మనిషి ప్రాణాలను కాపాడటమే కాదు ఏకంగా మనిషులనే సృష్టిస్తున్నాయి ఏఐ టెక్నాలజీ రోబోలు.
ఏఐ టెక్నాలజీతో పిల్లలు కంటున్నారా..?
వివిధ కారణాలతో పెళ్ళయి చాలాకాలమైనా పిల్లలులేనివారికి వైద్య పద్దతుల ద్వారా సంతానం పొందుతుంటారు. ఇలాంటి వైద్య పద్దతుల్లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) సక్సెస్ ఫుల్ పద్దతిగా గుర్తింపుపొందింది. ఇందులో స్త్రీ అండాన్ని, పురుషుడి శుక్రకణాన్ని సేకరించి శరీరం బయట ప్రయోగశాలలో ఫలదీకరణం చేస్తారు. ఈ పిండాన్ని మాతృత్వం పొందాలనుకుంటున్న మహిళ గర్భాశయంలోకి బదిలీచేసి గర్భందాల్చేలా చేస్తారు... ఇలా కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనడమే ఐవిఎఫ్.
ఈ ఐవిఎఫ్ విధానంలో అండం, శుక్రకణం ఫలదీకరణను ల్యాబ్ లో మరింత సమర్ధవంతంగా చేపట్టేందుకు ఏఐ ఆధారిత రోబో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలా రోబోటిక్ ఇన్ విట్రో ఫెర్టిలేజేషన్ లో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతోందని... ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా తల్లులు ఈ పద్దతిలో పిల్లలను కన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఈ ఏఐ రోబోటిక్ ఐవిఎఫ్ ఉపయోగాలు
అండం, శుక్రకణాన్ని శరీరం బయట ఫలదీకరణ చేస్తారు కాబట్టి మానవ తప్పిదాలు జరిగే అవకాశాలుంటాయి. ల్యాబ్ లో ఫలదీకణ సమయంలో ఏ తప్పు జరిగినా అది పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ ఏఐ ఆధారిత రోబో ఐవిఎఫ్ పద్దతిలో ఎలాంటి తప్పు జరగకుండా ఖచ్చితత్వంతో ఫలదీకరణ జరుగుతుంది.
స్పెర్మ్ కదలికలు లేదా పిండ నిర్మాణం జరిగే ప్రక్రియను సూక్ష్మంగా పరిశీలించేలా ఈ ఏఐ రోబో ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతమైన పిండం, శుక్రకణాల ఎంపిక నుండి ఫలదీకణం పూర్తయి పిండం తల్లి గర్భాశయంలోకి చేరేవరకు ఎలాంటి మానవ తప్పిదాలు లేకుండా ఏఐ రోబోలు ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ఇలా ఐవిఎఫ్ ప్రక్రియను వేగవంతంగా చేయడమే కాదు సక్సెస్ ఫుల్ గా పూర్తి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడంలో ఏఐ ఆధారిత రోబోలు ఉపయోగపడుతున్నాయి. ఇలా ఐవిఎఫ్ లో ఏఐ ఉపయోగం పెరిగింది.
ఐవిఎఫ్ లో మరో విప్లవం
చాలాకాలంగా సంతానం కోసం ఎదురుచూసిన దంపతులు పెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. జన్యుపరమైన అంశాలే కాదు ప్రస్తుతం తినే అహారం, ఇతర అలవాట్లు, వృత్తిపరమైన ఒత్తిళ్లు ఇలా అనేక విషయాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో చాలామంది దంపతులు కృత్రిమ పద్దతుల్లో సంతానం పొందుతున్నారు. అందుకే ఫెర్టిలిటీ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది... దేశవ్యాప్తంగా ఈ సెంటర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
ఈ కాలంలో ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు సంతాన సమస్యలతో బాధపడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. చాలాదేశాల్లో దంపతులు పిల్లల కోసం వైద్యఖర్చులు భరించే పరిస్ధితులు లేవు... చాలామందికి కృత్రిమ పద్దతుల్లో పిల్లలను కనవచ్చనే విషయం కూడా తెలియదు. ఇలా భారతదేశంలో కూడా పేద దంపతులు పిల్లలులేక తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటివారికి ఐవిఎఫ్ క్లినికల్ ట్రయల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని మెక్సికోకు చెందిన ప్రముఖ సంతానోత్పత్తి వైద్యుడు అలెజాండ్ చావెజ్-బడియోలా తెలిపారు.
డాక్టర్ అలెజాండ్ చావెజ్-బడియోలా స్థాపించిన కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్ అనే స్టార్టప్ ఈ కృత్రిమ గర్భధారణ వైద్య పద్దతులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది. కాబట్టి సంతానం కోసం ఎదురుచూసే పేద ప్రజలు ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనవచ్చు.. ఎలాంటి ఖర్చు ఉండదని చెబుతున్నారు. లాటిన్ అమెరికా, టర్కీ వంటి దేశాల్లో కూడా ఈ ఏఐ ఆధారిత కృత్రిమ గర్భధారణ పద్దతులపై మరికొన్ని స్టార్టప్స్ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయి. ఇలాంటి దేశాల్లో పైసా ఖర్చులేకుండానే క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొని సంతానాన్ని పొందే అవకాశం దంపతులకు కల్పిస్తున్నారు.
వైద్యరంగలో ఏఐ
ఇటీవల హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఏఐ సాయంతో రోగనిర్దారణ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి టెస్టులు లేకుండా కేవలం ఎక్స్ రే ద్వారా క్షయ వ్యాధిని నిర్దారించారు డాక్టర్లు... ఇందుకోసం ఏఐని ఉపయోగించారు. చెస్ట్ ఎక్స్-రేలను ఉపయోగించి క్షయ వ్యాధి (టీబీ)ని నిర్దారించినట్లు కిమ్స్ హాస్పిటల్స్ పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ తెలిపారు. క్యూఎక్స్ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్‌ను ఉపయోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్-రేలను విశ్లేషించామన్నారు. ఇందులో ఎక్కడా మానవ ప్రమేయం లేదని డాక్టర్ లతాశర్మ వెల్లడించారు.