New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !
New Telecom Rule: నవంబర్ 1 మరో కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఫోన్ స్క్రీన్ పై కాలర్ అసలు పేరు డిస్ప్లే అయ్యేలా కొత్త రూల్ వస్తోంది. ఫేక్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

నవంబర్ 1 నుంచి మారనున్న కాలింగ్ రూల్స్
మీ ఫోన్ లో ఎవరిదైనా కాల్ వస్తే, ఇకపై నంబర్ తో పాటు వారి అసలు పేరు కూడా స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎవరిదైనా సిమ్ తీసుకునేటప్పుడు ఏ ఐడీ ప్రూఫ్ ఇచ్చారో, ఆ ఐడీలో ఉన్న పేరే అవతల వాళ్ళ ఫోన్ లో డిస్ప్లే అవుతుంది. సైబర్ మోసాలు, ఫేక్ కాల్స్ ను ఈజీగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది.
టెలికాం శాఖ టెలికాం ఆపరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ కొత్త సర్వీస్ ను కంపెనీలు తప్పనిసరిగా ప్రారంభించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ సర్వీస్ ను వాడడానికి యూజర్లు ఎలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. అలాగే ఫోన్ లో ఎలాంటి సెట్టింగ్స్ మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఆటోమేటిక్ గా పనిచేస్తుంది.
సీఎన్ఏపీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
ప్రభుత్వం టెలికాం కంపెనీలకు 4జీ, 5జీ నెట్వర్క్ లలో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ను తప్పనిసరి చేసింది. దీన్నే షార్ట్ కట్ లో సీఎన్ఏపీ అని పిలుస్తారు. దీనివల్ల ఏ అన్ నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చినా, ఆ నంబర్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో ఆ పేరు స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది.
ఒకవేళ ఆ నంబర్ గనుక మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉంటే మీరు సేవ్ చేసిన పేరే కనిపిస్తుంది. నంబర్ సేవ్ చేయకపోయినా సరే, సిమ్ తీసుకునేటప్పుడు ఇతరులు ఇచ్చిన ఒరిజినల్ నేమ్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ విదేశాల నుంచి అంటే ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే మాత్రం ఎలాంటి పేర్లు చూపించవు. కేవలం ఇంటర్నేషనల్ కాల్ అని మాత్రమే స్క్రీన్ పై వస్తుంది.
ప్రైవసీ, బిజినెస్ యూజర్లకు నిబంధనలు
యూజర్ల ప్రైవసీ భద్రత కోసం ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఎప్పుడైతే కాల్ కట్ అయిపోతుందో, ఆటోమేటిక్ గా ఆ పేరు టెలికాం సిస్టమ్ మెమరీ నుంచి డిలీట్ అయిపోతుంది. దీనివల్ల మీ పర్సనల్ డేటా ఎక్కడా లీక్ కాదు. ఒకవేళ ఎవరైనా సీఎల్ఐఆర్ సర్వీస్ తీసుకొని తమ పేరును గోప్యంగా ఉంచితే, వారి పేర్లు మాత్రం స్క్రీన్ పై చూపించవు.
బిజినెస్, బల్క్ కనెక్షన్లు వాడేవారికి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించారు. వ్యాపార సంస్థలు తమ ట్రేడ్ మార్క్ లేదా రిజిస్టర్డ్ బిజినెస్ నేమ్ ను స్క్రీన్ పై చూపించుకోవచ్చు. దీనికోసం జీఎస్టీ పోర్టల్ లేదా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ డాక్యుమెంట్లను టెలికాం ఆపరేటర్లకు ఇచ్చి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రూల్ కేవలం 4జీ, 5జీ నెట్వర్క్ లకూ మాత్రమే వర్తిస్తుంది. 2జీ, 3జీ, ల్యాండ్ లైన్ లపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు.
ప్రజలకు ప్రయోజనాలు.. ముఖ్యమైన టిప్స్
ఈ కొత్త సిస్టమ్ రావడం వల్ల చాలా లాభాలున్నాయి. ట్రాయ్ గత కొన్ని నెలలుగా దీనిపై ట్రయల్స్ నిర్వహించి అక్టోబర్ 2025 లో దీనికి ఆమోదం తెలిపింది. దీనివల్ల సైబర్ ఫ్రాడ్స్, స్పామ్ కాల్స్, బెదిరింపు కాల్స్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రజలు ఇకపై ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ పై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
యూజర్లు అందరూ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మీ సిమ్ కార్డ్ మీ పేరు మీదో లేక మీ కుటుంబ సభ్యుల పేరు మీదో ఉంటే, నవంబర్ 1 నుంచి అడ్రస్ లో ఉన్న అవే పేర్లు ఇతరులకు కనిపిస్తాయి. అందువల్ల మీ సిమ్ కు సంబంధించిన కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మంచిది. బిజినెస్ ఓనర్లు కూడా తమ జీఎస్టీ డాక్యుమెంట్లతో బ్రాండ్ నేమ్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాలి.

